విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్ ముందు గోరంట్ల మాధవ్ హైడ్రామా..
Publish Date:Mar 6, 2025
Advertisement
గోరంట్ల మాధవ్ గురువారం (మార్చి 6) సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో వాస్తవానికి పోలీసుల నోటీసుల ప్రకారం గోరంట్ల మాధవ్ బుధవారం (మార్చి 5)విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు పోలీసులు గురువారం విచారణకు హాజరు కావడానికి అనుమతి ఇచ్చారు. దీంతో గురువారం విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ కు విచారణకు వచ్చిన గోరంట్ల మాధవ్ అక్కడ నానా హంగామా చేశారు. ఏదైనా కేసులో పోలీసు విచారణకు ఎవరైనా సరే ఒక్కరే హాజరు కావాలి. పోలీసులు అనుమతిస్తే ఒక లాయర్ ను వెంట తెచ్చుకోవచ్చు. అయితే గోరంట్ల మాధవ్ మాత్రం తనలో ఓ పది మంది లాయర్లను తీసుకువచ్చారు. తనతో పాటు వారందరినీ కూడా అనుమతించాలంటూ పట్టుపట్టారు. పోలీసులు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు గోరంట్ల మాధవ్ తో పాటు ఒక లాయర్ ను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసినా కూడా గోరంట్ల మాధవ్, ఆయనతో పాటు వచ్చిన లాయర్లు వాగ్వాదం కొనసాగించడంతో ఒక దశలో పోలీసులు ఒక్క లాయర్ ను కూడా అనుమతించేది లేదని తెగేసి చెప్పడంతో చివరికి దిగివచ్చిన గోరంట్ల మాధవ్ ఒకే ఒక్క లాయర్ తో విచారణకు హాజరయ్యారు. గోరంట్ల మాధవ్ గతంలో పోలీసు అధికారిగా పని చేశారు. నిందితుడిగా విచారణకు హాజరయ్యే వ్యక్తి తన వెంట ఎవరిని తీసుకువెళ్ల వచ్చు అనే విషయం తెలియకుండానే ఆయన అంత కాలం పోలీసు అధికారిగా ఉద్యోగం వెలగబెట్టారా? అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/gorantla-madhav-high-drama-at-vijayawada-cyber-crime-police-station-25-193968.html





