భాగస్వామిని వదిలేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లలో ఈ లక్షణాలు ఉంటాయి..!
Publish Date:Mar 1, 2025

Advertisement
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను చాలా మార్చేస్తుంది. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు భార్యాభర్తలు అయ్యాక వారిద్దరి జీవితాలు, వారి సంతోషాలు ఒకరి పట్ల మరొకరు ప్రవర్తన, ఒకరితో మరొకరు నడుచుకునే విధానం మీద ఆధారపడి ఉంటాయి. పెళ్లైన కొత్తలో ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. కానీ భాగస్వామి కాలక్రమేణా మారుతూ ఉంటే.. అది అతను మీ నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నాడని అర్థం కావచ్చు. అతని ప్రవర్తనలో ఏదో తేడాను గమనించడం ప్రారంభిస్తే, అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.
ప్రేమ, గౌరవం, నమ్మకం అనే పునాదిపై ఆధారపడిన సంబంధం వైవాహిక బంధం. భాగస్వాములిద్దరూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకున్నంత కాలం మాత్రమే ఈ బంధం బలంగా ఉంటుంది. కానీ వీటిలో ఏవైనా బలహీనపడటం మొదలైతే ఆ సంబంధం విచ్ఛిన్నం అంచుకు చేరుకుంటుంది. భాగస్వామిని వదిలేసే ఉద్దేశ్యం ఉండేవారిలో కొన్ని లక్షణాలు, ప్రవర్తనా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
ఇంటరెస్ట్ లేకపోవడం..
భాగస్వామి మీతో ఇంతకు ముందులాగా ఓపెన్ గా మాట్లాడకపోతే లేదా మీరు చెప్పే దానిపై ఆసక్తి చూపకపోతే అది వారికి మీ మీద ఆసక్తి పోయిందని చెప్పడానికి ఒక సంకేతం. ఎప్పుడూ భార్యతో మాట్లాడటానికి లేదా భార్యతో సమయం గడపడానికి వాయిదాలు వేయడం, తప్పించుకోవడం, బిజీగా ఉన్నానని సాకులు చెప్పడం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం, మునుపటిలాగా మాట్లాడటానికి, ప్రేమగా ఉండటానికి ఆసక్తి చూపడం లేదని తెలుపుతుంది.
శారీరక, భావోద్వేగాలు..
భాగస్వామి మునుపటిలాగా శ్రద్ధ వహించడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? అతను భార్యకు దగ్గరగా రావడానికి, చేయి పట్టుకోవడానికి శారీరకంగా దగ్గరగా ఉండటానికి ఇష్టపడకుండా సంకోచంతో ఉంటున్నాడా? వీటికి అవును అనే సమాధానం వస్తే.. అతను మానసికంగా, శారీరకంగా దూరం అవుతున్నాడనడానికి ఇది సంకేతం.
గొడవ..
ప్రేమ, పరస్పర అవగాహన సంబంధంలో ముఖ్యమైనవి. కానీ భాగస్వామి ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం చేస్తుంటే.. అది అతను లోలోపల ఇబ్బంది పడుతున్నారని సూచిస్తుంది. కొన్నిసార్లు ఈ గొడవల ద్వారా అతను వేరు వెళ్లిపోవాలని ప్రయత్నించడం కూడా జరగవచ్చు.
భవిష్యత్తు ప్రణాళిక..
భాగస్వామి తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో భార్యను చేర్చకపోతే అది ఆందోళన కలిగించే విషయం కావచ్చు. అతను అకస్మాత్తుగా తన కెరీర్, ప్రయాణ ప్రణాళికలు లేదా ఇతర విషయాలకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటే అతను ఈ సంబంధాన్ని కొనసాగించే మూడ్‌లో లేడని అర్థం చేసుకోవచ్చు.
సామాజిక జీవితంలో దూరం..
భాగస్వామి గతంలో మిమ్మల్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి ఆసక్తి చూపి, ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడుతూ తన స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే ఇది కూడా ఒక వార్నింగ్ సిగ్నల్ కావచ్చు. అతను తన జీవితంలో మీ ఉనికిని నెమ్మదిగా తగ్గించుకుంటున్నాడని సూచిస్తుంది.
ఏమి చేయాలి?
సంబంధంలో పైన చెప్పుకున్న మార్పులను గమనించినట్లయితే, ఆందోళన చెందడానికి బదులుగా, ఇద్దరూ కలిసి మాట్లాడటానికి మార్గాన్ని వెతకాలి. భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా అడిగినప్పుడు అతను ఒత్తిడికి లోనవ్వవచ్చు. పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్టు అనిపిస్తే రిలేషన్ షిప్ కౌన్సెలర్ నుండి సహాయం తీసుకోవడం కూడా మంచి ఎంపిక కావచ్చు. సంబంధాన్ని కాపాడుకోవడానికి భాగస్వాములిద్దరి ప్రయత్నాలు చేయడం అవసరం. ఇరిద్దరూ ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ సంబంధం మళ్ళీ బలపడుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/when-to-break-up-with-someone-you-love-35-193634.html












