జనౌషది దివస్ వీక్.. జెనరిక్ మందుల గురించి అవగాహన పెంచే వేదిక..!
Publish Date:Mar 1, 2025
.webp)
Advertisement
జనరిక్ ఔషధాల గురించి అవగాహన పెంచడానికి, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి మార్చి మొదటి వారాన్ని 'జన్ ఔషధి సప్తాహ్' లేదా జనరిక్ మెడిసిన్ వీక్‌గా జరుపుకుంటారు. ఇది 'జన్ ఔషధి దివస్' లేదా జనరిక్ మెడిసిన్‌తో ముగుస్తుంది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమం జనరిక్ ఔషధాల వాడకం గురించి ప్రజలకు తెలియజేయడం, అందరికీ సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తుంది.
జెనరిక్ ఔషధాలు..
డోసేజ్ , భద్రత, బలం, వాటిని ప్రజలలోకి తీసుకొచ్చే విధానం, నాణ్యత, జనరిక్ మందులను ఉద్దేశించిన ఉపయోగం వంటి వివిధ అంశాలలో ఇప్పటికే ఉన్న బ్రాండ్-నేమ్ ఔషధాలను ప్రతిబింబించేలా రూపొందించబడిన జెనరిక్ మందులు సమానమైన క్లినికల్ ప్రయోజనాన్ని అందిస్తాయి. జెనరిక్ ఔషధ ఉత్పత్తి, ఎగుమతిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులో ఉండేలా, తక్కువ ఖర్చులో వైద్యం జరిగేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
జనరిక్ ఔషధాల అవసరం..
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు వారి ఆర్థిక పరిమితులకు మించి వైద్యం ఖర్చులు అవుతున్నాయి. తక్కువ ఖర్చుతో కూడిన అధిక-నాణ్యత గల జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించడం ఈ జెనరిక్ మందుల దినోత్సవ ప్రాధాన్యత. దాదాపు 60% భారతీయ కుటుంబాలకు ఆరోగ్య బీమా లేకపోవడంతో, వారి జేబులోంచి వేద్యం ఖర్చులు చాలా మందిని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నాయి.
జన్ ఔషధి కేంద్రాల పాత్ర..
ప్రధాన మంత్రి జన్ ఔషధి పరియోజన (PMBJP) కింద పనిచేసే జన్ ఔషధి కేంద్రాలు పేదరికానికి పరిష్కారంగా నిలుస్తాయి. ఈ కేంద్రాలు మొదటి మూడు బ్రాండెడ్ ఔషధాల సగటు ధరలో 50% పరిమిత ధరలకు జనరిక్ ఔషధాలను అందిస్తాయి. తత్ఫలితంగా, జన్ ఔషధి మందులు కనీసం 50% చౌకగా ఉంటాయి. కొన్నిసార్లు వాటి బ్రాండెడ్ మందుల కంటే 80% నుండి 90% తక్కువ ఖరీదులో దొరుకుతాయి. దీని వల్ల వినియోగదారులకు డబ్బు పొదుపు అవుతుంది.
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (PMBJP)..
రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం నవంబర్ 2008లో ప్రారంభించిన PMBJP, జనరిక్ ఔషధాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో గణనీయంగా దోహదపడింది. నవంబర్ 30, 2023 నాటికి భారతదేశం అంతటా 10,000 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. PMBJP 2023లో దాదాపు 1000 కోట్లు ఆదా చేసింది. ఇది దేశంలో జనరిక్ ఔషధాల చరిత్రలో ఒక మైలురాయిగా నమోదైంది.
PMBJP ప్రభావం..
ధరల విషయంలో PMBJP విధానం అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రజలకు మంచి పొదుపు మార్గంగా మారింది. ఉదాహరణకు వివిధ బ్రాండ్ పేర్లతో యూనిట్‌కు రూ. 72 ఖరీదు చేసే టెల్మిసార్టన్ 40 mg మాత్రలు, యూనిట్‌కు దాదాపు రూ. 12 కు జెనరిక్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. జన ఔషధి కేంద్రాల ద్వారా మందులను అందించడం ద్వారా దేశ పౌరులకు సుమారు 5000 కోట్లు ఆదా చేయడం PMBJP సాధించిన విజయం.
భవిష్యత్తు లక్ష్యాలు, విస్తరణ..
మరిన్ని వర్గాలకు సేవ చేయడం,ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశ్యంతో PMBJP మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణాల జన్ ఔషది కేంద్రాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుకాణాలలో 1,700 కంటే ఎక్కువ మందులు, 200 శస్త్రచికిత్సా వస్తువులు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ 10 లక్షలకు పైగా ప్రజలు ఈ దుకాణాలను సందర్శిస్తున్నారు. ఇది తక్కువ ఖర్చులో లభించే జనరిక్ ఔషధాలపై పెరుగుతున్న నమ్మకం. దీని వల్ల ప్రజలు ఈ మందులను వాడటానికి మరింత ఆసక్తి చూపిస్తారు.
భారతీయ ఔషధ పరిశ్రమ, జనరిక్ మందులు:
ప్రపంచవ్యాప్తంగా వాల్యూమ్ పంగా మూడవ స్థానంలో, విలువ పరంగా 13వ స్థానంలో ఉన్న భారతదేశ ఔషధ పరిశ్రమ, 60 చికిత్సా వర్గాలలో 60,000 కంటే ఎక్కువ జనరిక్ ఔషధాలను తయారు చేస్తుంది. ప్రతి ఏడాది జనరిక్ మందుల ప్రస్థానం పెరుగుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రజలు కూడా జనరిక్ మందులను ప్రోత్సహించడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవడమే కాకుండా తక్కువ ఖర్చులోనే ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవచ్చు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/pradhan-mantri-bhartiya-janaushadhi-pariyojana-pmbjp-35-193674.html












