కేసీఆర్ బీహార్ పర్యటన కాయా? పండా?
Publish Date:Aug 31, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఏ కారణం చెప్పినా ఆయన బీహార్ పర్యటన మాత్రం కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులకు ఎటువంటి సత్ఫలితాలూ రాలేదు. బీహార్ పర్యటన కూడా కేసీఆర్ కు రాజకీయంగా ఏ మంత కలిసిరాలేదు. తన బీహార్ పర్యటనలో కేసీఆర్ ముందుగా చెప్పినట్లే అక్కడి అమర వీరుల కుటుంబాలకు.. అలాగే సికింద్రాబాద్‌లో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల కుటుంబాలకు దాదాపుగా రూ. కోటి ఆర్థిక సాయం అందచేశారు. అక్కడి వరకూ ఓకే కానీ కేసీఆర్ కు రాజకీయంగా అండగా నిలుస్తామన్న హామీని మాత్రం బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి పొందడంలో మాత్రం విఫలమయ్యారు. మర్యాదపూర్వకంగా కేసీఆర్ తో కలిసి ప్రెస్ మీట్ లో అయితే పాల్గొన్నారు కానీ నితీష్ కుమార్ ఎక్కడా రాజకీయపరమైన ప్రకటనలు కానీ, జాతీయ స్థాయి రాజకీయాలలో మోడీకి వ్యతిరేక కూటమి గురించి కానీ మాట్లాడలేదు. పైపెచ్చు కేసీఆర్ మాట్లాడటం కూడా తనకు ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పకనే చెప్పాశారు. తన బాడీ లాంగ్వేజ్ ద్వారా అయితేనేమి, కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా నితీష్ తో కలిసి సాగుతామంటూ కేసీఆర్ మీడియా సమావేశంలో చెబుతుండగానే నితీష్ సమావేశం నుంచి లేచి వెళ్లి పోవడానికి ప్రయత్నించారు. అయితే స్వయంగా కేసీఆర్ వారించడంతో సభా మర్యాద పాటించాలి కనుక ఆగిపోయానన్నట్లుగా కూర్చున్నారు. కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీ ముక్త భారత్ అంశాన్ని ప్రస్తావించారు. అందుకోసం నితీష్ కుమార్ తో కలిసి పని చేస్తామన్నారు. కమలం పార్టీ పాలనలో దేశం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యత నేడు దేశానికి అత్యవసరమన్నారు. నితీష్ తో కలిసి ఆ దిశగా పని చేస్తామన్నారు. రాబోయేది థర్డ్ ఫ్రంట్ కాదనీ, అది మెయిన్ ఫ్రంట్ అనీ చెప్పారు. ఈ ఫ్రంట్ కు నాయకత్వం ఎవరు వహిస్తారన్నది ఎన్నికల సమయంలోఅందరం చర్చించుకుని నిర్ణయిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇక్కడే కేసీఆర్ కు రాజకీయంగా బీహార్ పర్యటన ఏ మాత్రం ప్రయోజనం కలగలేదన్నది అవగతమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ పార్టీ నాయకత్వాన్ని కలిసినా జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక శక్తులకు తానే నాయకత్వం వహిస్తాననీ, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతాననీ చెబుతూ వచ్చారు. అయితే ఎక్కడా ఆయనకు సానుకూలత వ్యక్తం కాకపోవడంతో బీహార్ లో బాణి, వాణి మార్చి.. నాయకత్వం విషయాన్ని విస్తృత చర్యల అనంతరం నిర్ణయించుకుంటామంటూ ఓ మెట్టు దిగారు. ఇక బీహర్ సీఎం విషయానికి వస్తే.. తమ రాష్ట్రానికి వచ్చారు కనుక పొగడక తప్పదన్నట్లుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడంటూ ప్రశంసలు గుప్పించారు. గ్రామీణాభివృద్ధి కోసం తెలంగాణలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు భేష్ అన్నారు. మిషన్ భగీరథ పథకాన్నీ పొగిడారు. అంతే తప్ప రాజకీయ విషయాలపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో బీహార్ పర్యటన కూడా కేసీఆర్ కు జాతీయ రాజకీయాల దిశగా ముందుకు సాగేందుకు ఎంత మాత్రం ఉపయోగపడలేదని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనతో పాటు కలిసి వచ్చేలా, కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా కలిసి పోరాడేందుకు నితీష్ కు ఒప్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారని చెబుతున్నారు. పైపెచ్చు మా రాష్ట్రాలనికి వచ్చారు. గాల్వాన్ మృతుల కుటుంబాలనూ, సికిందరాబాద్ అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలనూ కలిసి పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందజేస్తానన్నారు. ఆ పని చేసుకు వెళ్లండి చాలు అన్నట్లుగా నితీష్ కుమార్ వ్యవహరించారనీ, కేసీఆర్ మాట్లాడుతుండగానే నితీష్ ప్రెస్ మీట్ నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నించడమే.. రాజకీయంగా కేసీఆర్ తో అడుగులు కలిపేందుకు ఆయనకు సుతరామూ ఇష్టం లేదని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-the-political-outcome-of-kcr-bihar-tour-39-143002.html