అమరావతి జయహో.. జగన్ రియాక్షన్ ఏంటో..
Publish Date:Mar 3, 2022
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, రాష్ట్ర హై కోర్టు మళ్ళీ మొట్టి కాయాలు వేసింది. నిజమే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి , ఆయన ప్రభుత్వానికి, కోర్టులు వేసే మొట్టికాయలు తినడం, నెత్తిన అక్షింతలు వేయించుకోవడం కొత్త కాదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి అలాంటి అనుభవాలు అనేకం ఉన్నాయి. అయితే, అవన్నీ ఒకెత్తు అయితే, ఇప్పుడు రాష్ట్ర రాజధాని విషయంలో హై కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఒక్కటీ ఒకెత్తు, అనుకోవచ్చును. ‘తాను పట్టిన కుందేటికి ‘మూడే’ కాళ్ళని’ , మూడు రాజధానుల విషయంలో మొండి వైఖరి అవలంబించిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి, హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేసిందంటే, అతిశయోక్తి కాదు. ఒకటీ రెండు కాదు , ఏకంగా ఎనిమిది వందల రోజులకు పైగా, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా నిలుపుకోవాలని, ఎండా వానలతో పాటు కరోనా మహమ్మారిని కుడా తట్టుకుని రాజదానికోసం భూములు ఇచ్చిన రైతులు సాగించిన చారిత్రక ఆందోళన విజయం సాధించింది. అవును, హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో, రైతు గెలిచాడు, ధర్మం జయించింది. అమరావతి విజయం సాధించింది. జయహో ..అమరావతి నిపించుకుంది. అన్నిటినీ మించి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు విజయం సాధించారు. అయితే, ఇప్పటికి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు తీర్పు విషయంలో ఎలా స్పందిస్తుందనే విషయాలో సందేహాలు అయితే ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో అనుసరిస్తున్న మొండి వైఖరి అంత తేలిగ్గా వదులు కుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్న తర్వాత కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం, మళ్ళీ బిల్లు తెస్తామని, ఈసారి మరింత పకడ్బందీగా చట్టం చేస్తామని అంటూనే వుంది. అందుకే, హై కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి ప్రభుత్వం మారాలని, సీఆర్డీయే చట్టం ప్రకారం రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి అని జగన్ ప్రకటించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చిచెప్పింది. ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడవలసి వుందని అంటున్నారు.
ఇంతవరకు రాజధాని ఏదంటే, నీళ్ళు నమిలిన ఆంధ్రులు, ఇప్పుడు, ‘అమరావతి మా రాజధాని’ అని సగౌరవంగా చెప్పుకోవచ్చన్న ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు.అమరావతి రైతులు మాత్రమే కాదు, కోర్టు తీర్పుతో రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-jagan-reaction-on-amaravati-39-132512.html





