జగన్ హస్తిన పర్యటన ఏమైంది? మోడీ, షా అప్పాయింట్ మెంట్ దొరకలేదా?
Publish Date:Aug 24, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన ఏమైంది? కొన్ని వారాల కిందట జగన్ హస్తిన పర్యటనకు వెడుతున్నారనీ, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారనీ వైసీపీ ఆర్భాటంగా ప్రకటించింది. వైసీపీ సోషల్ మీడియాలో జగన్ పర్యటన గురించిన పోస్టులు పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తాయి. దీంతో జగన్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు, ప్రధానంగా అధికార మార్పిడి తర్వాత చోటుచేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తిన టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన పర్యటనలో జగన్ మోడీ, షాలతో చర్చించే అంశాలేంటి? జగన్, ఆయన పార్టీ నేతలు, సన్నిహిుతలు ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ విచారణలు వేగవంతమై, దర్యాప్తులు కొలిక్కి వస్తున్న వేళ ఆయన మోడీ, అమిత్ షాలతో భేటీ కానున్నారన్న వార్తలు ఉత్కంఠకు తెరలేపాయి. జగన్ ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో జగన్ పర్యటన సంగతేమైందన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆయనకు మోడీ, అమిత్ షాలు అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ సఖ్యతగా వ్యవహరించింది. జగన్ ఎప్పుడు కోరితే అప్పుడు మోడీ, షాల అప్పాయింట్ దొరికేసేది. అయితే 2024 ఎన్నికల తరువాత నుంచి పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. కేంద్రం కోరినా కోరకున్నా...జగన్, వైసీపీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నిటికీ బేషరతు మద్దతు ఇస్తున్నా.. కేంద్రం పెద్దలు ఆయనను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇక రాష్ట్రంలో కొలువుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అక్రమాలపై వరుస విచారణలు జరుపుతుంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ అక్రమాస్తులు, మద్యం కుంభకోణం కేసుల విచారణల్లో వేగం పెంచుతున్న పరిస్థితిప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. కేంద్రం పెద్దలను కలిసి రక్షణ కోరేందుకు జగన్ మోడీ, షాల అప్పాయింట్ మెంట్ కోరారని రాజకీయవర్గాలలో విస్తృత ప్రచారం జరిగింది. కట్ చేస్తే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన ఊసెత్తడం లేదు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఆయన హస్తిన పర్యటనకు సంబంధించిన వివరాలేవీ కనిపించడం లేదు. దీంతో మోడీ, షా జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని స్పష్టమౌతోందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో.. జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం రాజకీయంగా ప్రతికూల సంకేతాలు ఇస్తుందన్న భావనతో మోడీ, షాలు జగన్ కు అప్పాయింట్ మెంట్ నిరాకరించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏ దిశగా సాగుతుంది, కేంద్ర ప్రధాన నాయకులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల విచారణ గతిని, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును ఈ పర్యటన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. What happend to Jagan delhi tour, Modi, Shah, Appointment, Cases, Nda, Telugudesham, Ap, TeluguOne
http://www.teluguone.com/news/content/what-happend-to-jagan-delhi-tour-25-229710.html





