ఇది ప్రకృతి విపత్తు మేమేం చేయలేం.. అంబటి
Publish Date:Jul 19, 2022
Advertisement
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వ పెద్దలైనా ఏం చేయాలి? కాలికి బలపం కట్టుకుని మరీ బాధిత ప్రాంతాల్లో తిరగాలి. బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు సరిగా జరిగేలా చూడాలి. గతంలో విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు అలాగే చేశారు. ప్రత్యేక బస్సులో విశాఖ వెళ్లి, సహాయ కార్యక్రమాలు సజావుగా జరిగేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. బస్సులోనే బస చేసి మరీ రేయంబవళ్లు బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూశారు. తుపాను ధాటికి ధ్వంసమైపోయిన సుందర విశాఖ నగరాన్ని కొద్ది రోజుల వ్యవధిలోనే యథా పూర్వస్థితికి వచ్చేలా చేశారు. అంతకు ముందు కూడా పలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఈ విధంగానే స్పందించాయి. అయితే.. తాజాగా ఏపీలో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి జనం సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఇంతలా గోదావరి నది విరుచుకు పడితే.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మాత్రం ‘ఇది ప్రకృతి విలయం. మనమేం చేయలేం’ అంటూ చేతులెత్తేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పి తన చాతకాని తనాన్ని చాటుకున్నారు. జులై నెలలో గోదావరి నదికి భారీ వరదలు రావడం అరుదన్నారు. సాధారణంగా జులై నెలాఖరులోనో, ఆగస్టులోనో వరదలు వస్తాయి. కానీ ఇంత భారీ స్థాయిలో వరదలు జులై నెల మధ్యలోనే రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇంతలా వరదలు విరుచుకుపడతాయని అస్సలు ఊహించలేదని ఆయన చెప్పారు. జనం దీనినే తప్పుపుడుతున్నారు. వరదలు ముంచుకొస్తాయని ముందే హెచ్చరించాల్సిన వాతావరణ విభాగం పనిచేయలేదా? ముసుగుదన్ని పడుకుందా? అని నిలదీస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని వందలాది లంక గ్రామాలు వరదనీటిలో మునిగిపోయి బాధితులు అల్లాడిపోతుంటే.. స్పందించి సహాయం అందించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బాధితులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, సహాయక శిబిరాల్లో ఆహారం, పాలు, తాగునీరు లాంటి సౌకర్యాల కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పలు లంక గ్రామాల్లో గుండె లోతు నీటిలో నడిచి వెళ్లి మరీ బాధితులకు సహాయం అందించారు. లంక గ్రామాల్లోనే రాత్రిళ్లు బస చేసి మరీ వారికి అండగా నిలిచారు. అయితే అధికార వైసీపీ నేతలు ఎవరూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పలకరించిన వైనం, పరామర్శించిన దాఖలాలు లేవంటున్నారు. పైగా అంబటి తీరిగ్గా విజయవాడలో మీడియా సమావేశం పెట్టి మరీ ‘మనమే చేయలేం’ అనడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన వరద విలయ తాండవం చేస్తుంటే.. బాధితులను ఆదుకోకపోగా.. ఈ సందర్భాన్ని కూడా రాజకీయం చేయడానికి మంత్రి అంబటి ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు ఏకమై వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొనగల ప్రజాదరణ గల నేత జగన్ అని చెప్పుకున్నారు. వరదలు, జనం బాధలు, నష్టం గురించి పట్టించుకోని మంత్రి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వమే అని నింద వేస్తుండడం ఏంటని అంటున్నారు. కాఫర్ డ్యామ్ కట్టకపోయినా ఫర్వాలేదని ఇంజనీర్లు చెబుతున్నారంటూనే.. అనుకున్న సమయానికి దిగువ కాఫర్ డ్యామ్ ను పూర్తిచేయలేకపోయామని తప్పు ఒప్పుకోవడం గమనార్హం. వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న బాధితులను స్వయంగా పరామర్శించకుండా గాల్లోనే తిరిగి గాల్లోనే తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయిన జగన్ ఎక్కడ? హుద్ హుద్ తుపాను బీభత్సం సమయంలో విశాఖలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పరుగులు పెట్టించిన చంద్రబాబు ఎక్కడ? అంటూ జనం చెప్పుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/we-cant-do-anything-in-natural-calamity-says-ambati-25-140095.html