వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఛేంజ్?
Publish Date:Nov 3, 2015
Advertisement
వరంగల్ పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మీద పీకలదాకా కోపం మీద వున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని టీఆర్ఎస్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చాలా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈ స్థానం నుంచి గట్టి అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ఎంపిక చేసింది. సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడటంతో వరంగల్ లోక్‌సభ ఎన్నిక రసవత్తరంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు రాజయ్య ఈ స్థానంలో పోటీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాజయ్య స్థానంలో మరో వ్యక్తిని పోటీలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బుధవారం ఉదయం సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఘోరమైన దుర్ఘటన జరిగింది. ఆయన కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్ళు గ్యాస్ సిలెండర్ పేలడంతో సజీవ దహనం అయ్యారు. ఈ దుర్ఘటనను పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తు్న్నారు. రాజయ్య కుమారుడిని సారిక ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మామాకోడళ్ళ మధ్య విభేదాలు వున్నాయి. ఆమె గతంలో రాజయ్య మీద గృహహింస కేసును పెట్టారు. అలాగే కొన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇప్పుడు జరిగిన దుర్ఘటన కూడా ఆత్మహత్యేనని పలువురు అనుమానిస్తున్నారు. నిజానికి బుధవారం నాడు రాజయ్య వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేయాల్సి వుంది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఇతర పార్టీల వారు రాజకీయానికి ఉపయోగించుకునే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ ఘటన రాజయ్యకు పెద్ద ఎదురుదెబ్బలా భావించవచ్చు. ప్రజల్లో కూడా రాజయ్యకి వున్న ఇమేజ్ చాలా దారుణంగా దెబ్బతినే ప్రమాదం వుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికలలో రాజయ్యను పోటీ నుంచి తప్పించే అవకాశాలు వున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/warangal-parliament-rajaiah-45-51985.html





