ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం.. పశ్చిమాసియాలో తొలగిన యుద్ధ మేఘాలు
Publish Date:Jun 14, 2026
Advertisement
గత నాలుగు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తు్న పశ్చిమాసియా యుద్ధ మేఘాలు ఎట్టకేలకు తొలిగిపోయాయి. అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి తెరపడింది. ఇరు దేశాలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి .. చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి వచ్చాయి. సుదీర్ఘ చర్చల అనంతరం రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని వీడి, లెబనాన్ సహా అన్ని ప్రాంతాలలో సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై వచ్చే శుక్రవారం అంటే జూన్ 19 న స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఈ భారీ శాంతి చర్చల వెనుక పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించాయి. ఈ చారిత్రాత్మక ముందడుగును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్ లో ధ్రువీకరించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు అంటే అగ్రరాజ్యాధినేత ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. వాణిజ్య నౌకల రాకపోకలకు జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు స్పష్టం చేస్తూ.. ప్రపంచ దేశాల నౌకలారా.. మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, చమురును స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి అంటూ పేర్కొన్నారు. అలాగే ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాది కూడా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ద్వారా ఈ ఒప్పందాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ శాంతి వార్తలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని, ఊరటను నింపాయి. హర్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా పునఃప్రారంభం అవుతుందనే గట్టి నమ్మకంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివచ్చాయి. అయితే.. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ నేరుగా భాగస్వామి కాకపోవడంతో.. భవిష్యత్తులో ఈ శాంతి ఒప్పందం ఎంతవరకు స్థిరంగా కొనసాగుతుందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.
http://www.teluguone.com/news/content/war-clouds-lift-over-west-asia-36-222931.html





