బ్యాంకుల ముందు చెత్త పనిపై కేంద్రం సీరియస్.. కమిషనర్ సస్పెన్షన్
Publish Date:Dec 28, 2020
Advertisement
ఏపీలో సీఎం జగన్ కొత్తగా ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాల లబ్ది దారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని సాక్షాత్తు అధికారులే కృష్ణా జిల్లాలోని పలు బ్యాంకుల ముందు చెత్త వేయించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ చెత్త పనులపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సీరియస్ గా స్పందించి రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గనకు ఫోన్ చేసి మరీ క్లాస్ తీసుకోవడంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ ఈ ఘటన పై విచారణ జరిపి ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశ్‌రావు పై సప్సెన్షన్ వేటు వేసింది. ఐతే ఈ సస్పెన్షన్ కు ముందు అయన తన తప్పుకు క్షమాపణ చెప్పినప్పటికీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది, కొంత మంది లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ఎదుట చెత్త వేయడం బాధకరమని అన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామన్నారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు గాయపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు విజయ్‌కుమార్ చెప్పారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై విచారణ చేపట్టి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా తమ పరిదిలోని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన పై మచిలీపట్నం కమిషనర్ శివరామకృష్ణ, విజయవాడ కమిషనర్ల ప్రసన్న వెంకటేష్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. అయితే ఈ చెత్త పనికి ప్రధాన కారణం కొంత మంది ఉన్నతాధికారుల ఆదేశాలేనని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ల పర్వం ఇక్కడితో ఆగుతుందా లేక దీనికి బాధ్యులైన మరి కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/vuyyuru-municipality-commissioner-prakash-rao-suspended-39-108191.html





