బెజవాడ, విశాఖ మెట్రోలకు కేంద్రం పచ్చజెండా.!
Publish Date:Aug 10, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి రూపొందించిన విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు రూట్ క్లియర్ అయ్యింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్ లకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, ఫైనాన్షియల్ అప్రైజల్స్ కు పంపింది. ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ఈ రెండు భారీ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య విధానంలో చేపడుతున్నాయి. దీనివల్ల నిధులకు కొరత ఉండదు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 20 శాతం నిధులను సమకూరుస్తుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం నిధులను కేటాయిస్తుంది. మిగిలిన 60 శాతం భారీ మొత్తాన్ని ఆర్థిక సంస్థలు, విదేశీ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించేందుకు కసరత్తు జరుగుతోంది. టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా మొత్తం వ్యయంలో 40 శాతం మేర ప్రాథమిక అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మెట్రో రైల్ కార్పొరేషన్‌కు మంజూరు చేసింది. విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ తొలి దశను రూ. 11 వేల 498 కోట్ల అంచనా వ్యయంతో చేపడతారు. ఇందులో భాగంగా మొత్తం 46.23 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే మూడు ప్రధాన కారిడార్లను నిర్మిస్తారు. అందులో మొదటి కారిడార్ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కిలోమీటర్ల పొడవునా సాగుతుంది. రెండో కారిడార్ గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్ల పరిధిలో రూపుదిద్దుకుంటుంది. మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చైనా వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కారిడార్ల ఏర్పాటుతో వైజాగ్ లో పెరుగుతున్న రోడ్డు రవాణా ఒత్తిడి తగ్గడమే కాకుండా పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలు అభివృద్ధి పరుగులు పెడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధానికి ఆనుకుని వాణిజ్య, రవాణా, పాలనా కేంద్రంగా విరాజిల్లుతున్న విజయవాడ నగరంలో తొలి దశ మెట్రో నిర్మాణానికి 11 వేల009 కోట్ల రూపాయలు కేటాయించారు. విజయవాడ తొలి దశలో మొత్తం 38.40 కిలోమీటర్ల పొడవున రెండు కారిడార్లను నిర్మిస్తారు. ఇందులో గన్నవరం విమానాశ్రయం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకూ 25.95 కిలోమీటర్ల పొడవైన కారిడార్ ఏర్పాటు కానుంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తూ రెండో కారిడార్ సాగుతుంది. ప్రాజెక్టు వేగాన్ని పెంచేందుకు విజయవాడ బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరు ప్రాంతాలలో భూసేకరణ సర్వేలు, సామాజిక ప్రభావ అంచనా పనులు ప్రారంభమయ్యాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు నగరాల్లో ప్రతినిత్యం ప్రయాణించే లక్షలాది మంది ప్రజలకు ప్రయాణ సమయం, ఇంధన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే వాయు కాలుష్యం తగ్గుతుంది. అంతేకాక, మెట్రో కారిడార్ల వెంట కొత్త వాణిజ్య కేంద్రాలు ఏర్పడి ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తుది మదింపు ముగిసి అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. Vizag Metro Rail project, Vijayawada Metro, DPR approval, AP Metro Rail, AP Metro budget cost, Visakhapatnam Metro corridors, TeluguOne
http://www.teluguone.com/news/content/vizag-metro-rail-project-36-228509.html





