రూ. 19,496 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం
Publish Date:Sep 12, 2015
Advertisement
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ నగరాలలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ని ఈ ప్రాజెక్టుల ప్రధాన సలహాదారు శ్రీధరన్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు. వాటిలో విజయవాడలో పి.యస్. బి.యస్. నుంచి పెనమలూరు వరకు నిర్మించబోయే 26.03 కి.మీ. పొడవుగల మెట్రో ప్రాజెక్టుకి రూ.6, 769 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వైజాగ్ లో మదురవాడ సమీపంలో కొమ్మాది నుండి ఎన్.ఏ.డి. మీదుగా గాజువాక వరకు ఒక కారిడార్, గురుద్వారా జంక్షన్ నుండి పాత పోష్టాఫీసు వరకు మరో కారిడార్ నిర్మిస్తారు. మొత్తం 42.5 కి.మీ పొడవుగల ఈ రెండు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 12,727 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంటే విజయవాడలో ఒక కి.మీ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.260.04 కోట్లు అవసరమయితే, అదే వైజాగ్ లో ఒక కి.మీ.కి రూ.299.46 కోట్లు వ్యయం అవుతుందన్నమాట! 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నట్లయితే మెట్రో ప్రాజెక్టులు నిర్వహించడం లాభదాయకం కాదనే కారణం చేత విజయవాడ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చలేనని ఇదివరకే తేల్చి చెప్పింది. కానీ జపాన్ దేశానికి చెందిన జైకా అనే సంస్థ ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేప్పట్టాలని నిశ్చయించుకొంది. కానీ రెండు ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిస్తే వీలయినంత వరకు రెంటికీ కూడా నిధులు మంజూరు అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా 2018 డిశంబరు నాటికి పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా విజయవాడ-గుంటూరు-రాజధాని అమరావతిని కలుపుతూ సర్క్యులర్ రూటులో ఒక హైస్పీడ్ రైల్ నడిపేందుకు కూడా ప్రతిపాదనలు రైల్వే శాఖకు పంపించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ సమగ్ర నివేదిక తయారు చేసి ఈయవలసి ఉంటుందని అన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా రైల్వే శాఖదేనని వెంకయ్య నాయుడు అన్నారు. ఆ నివేదిక చేతికి అందగానే తను రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడి దానిని కూడా ఆమోదింపజేయిస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల నిర్మాణ పనులు మొదలు పెట్టే ముందు వాటికి అవసరమయిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. బహుశః త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమం మొదలుపెట్టవచ్చును.
http://www.teluguone.com/news/content/vizag-45-50030.html





