వివేకా హత్య కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..!
Publish Date:Aug 21, 2026
Advertisement
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..! వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ సునీత ఈ నెల 8న రాసిన లేఖ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, సీబీఐ డైరెక్టర్‌కు సునీత లేఖలు రాశారు. వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సునీత తన లేఖలో పేర్కొన్నారు. ఈ హత్య కేసులో భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నందున ఆర్థిక లావాదేవీల కోణాన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. ముఖ్యంగా కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన మనీ ట్రయల్‌ను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, హత్యకు ముందు.. తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు అధికారులు తగినంతగా దృష్టి సారించలేదని సునీత పేర్కొన్నారు. ఈ అంశాలను లోతుగా పరిశీలిస్తే హత్య వెనుక ఉన్న కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సీబీఐ దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆధారంగా చేసుకుని ఈడీ రంగప్రవేశం చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, దానికి సంబంధించిన ఆధారాలతో పాటు హత్య వెనుక జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. హత్య కేసులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరికి చేరింది? ఏ మార్గాల్లో బదిలీ అయింది? అనే అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ హవాలా, మనీలాండరింగ్ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య వెనుక అసలు ఆర్థిక లావాదేవీలు ఏమిటి? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి చేరాయి? అనే అంశాలపై ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఇప్పటివరకు ప్రధానంగా హత్యకు సంబంధించిన అంశాల చుట్టూ సాగిన వివేకా కేసు దర్యాప్తు.. తాజాగా ఆర్థిక కోణంలోనూ కీలక మలుపు తిరిగింది. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ ఆధారాలు కేసులో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. Viveka murder case, ED, CBI, YS Sunitha, President Draupadi Murmu, Money laundering, YS Jagan, YS Avanish reddy
http://www.teluguone.com/news/content/viveka-murder-case-36-229462.html





