ఈసారి విజయసాయి డౌటేనా? అప్పుడు అంబానీ, ఇప్పుడు అదానీ!
Publish Date:Jan 31, 2022
Advertisement
త్వరలోనే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి విజయసాయిరెడ్డి స్థానం. ఆ నాలుగు స్థానాల్లో నాలుగురు కీలక వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో విజయసాయి పేరు లేకపోవడం ఆసక్తికరం. అవును, మరోసారి విజయసాయిరెడ్డికి రాజ్యసభ స్థానం రెన్యువల్ కాదని అంటున్నారు. జగన్రెడ్డి.. విజయసాయిరెడ్డిని ఈసారి ఢిల్లీకి పంపించే ఆలోచన లేదని చెబుతున్నారు. హస్తినలో సొంతంగా సాయిరెడ్డి తన ఇమేజ్ పెంచుకుంటుండటం.. బీజేపీతో బాగా అంటకాగుతుండటం.. ఉత్తరాంధ్రలో ఓవరాక్షన్.. ఇలా తోక జాడిస్తున్న విజయసాయిరెడ్డి పేరు వెనుక ఎంపీ అనే తోక కట్ చేయనున్నారట జగన్. ఇప్పటికే తాడేపల్లిలో అడుగుపెట్టనీయకుండా విశాఖకే పరిమితం చేయగా.. ఇకపై ఢిల్లీ వెళ్లకుండా.. రాజ్యసభ అవకాశం ఇంకోసారి ఇవ్వబోరని వైసీపీ వర్గాలే అంటున్నాయి. సరే, విజయసాయిరెడ్డి పదవి ఫసక్. మరి, ఆయన స్థానంలో ఎవరు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. పార్టీ నేతలతో పాటు పారిశ్రామిక వర్గాలకూ పదవుల పందేరం జరపడంలో జగన్రెడ్డి సిద్ధహస్తుడు. ఇప్పటికే అంబానీ ప్రధాన అనుచరుడు, రిలయన్స్ గ్రూపులో కీలకమైన నత్వానీని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపించారు జగన్. ఆ మేరకు ఎలాంటి క్విడ్ ప్రొకో నడిచిందో బయటకు మాత్రం రాలేదు. సేమ్ టూ సేమ్.. ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీనే అప్లై చేయనున్నారట జగన్. ఇండియాలోకెల్లా టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్.. గౌతమ్ అదానీ కి జగన్రెడ్డి ఈసారి రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే అదానీకి ఏపీలో భారీగా ప్రయోజనాలు కల్పించారు. పోర్టులను దాదాపు గంపగుత్తగా ఇచ్చేశారు. ఇప్పుడిక రాజ్యసభ సీటు కూడా ఇవ్వనున్నారని అంటున్నారు. మరి, ఈసారి వారి మధ్య ఏం డీల్ జరిగిందో? ఇక, మిగిలిన మూడు రాజ్యసభ సీట్లలో సామాజిక సమీకరణాలే కీలకం కానున్నాయి. గుంటూరు జిల్లా, నెల్లూరుకు చెందిన ఇద్దరు నేతల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావును పెద్దల సభకు పంపిస్తారని తెలుస్తోంది. బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన బీదకు రాజ్యసభ టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. మిగిలిన రెండింటిలో ఒకటి కమ్మ కానీ, కాపులకు కానీ కేటాయిస్తారని టాక్. అదే విధంగా ఎస్సీలకు కూడా చాన్స్ ఉండవచ్చు అని చెబుతున్నారు. రాష్ట్ర నేతలకు ఓకే.. గుజరాతీయులకు ఏపీ నుంచి అవకాశమివ్వాలనుకోవడం.. అందులోనూ బడా పారిశ్రామిక వేత్తలనే ఎంచుకోవడం వెనుక.. బాగా లాభదాయక డీల్ ఏదో జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/vijayasaireddy-out-and-adani-in-jagan-mps-list-39-131002.html





