విజయసాయి రాజీనామా.. బీజేపీకి జగన్ ప్రేమసందేశమా?
Publish Date:Jan 25, 2025
.webp)
Advertisement
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో పెను సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఉరుములేని పిడుగులా విజయసాయి ఇంత హఠాత్తుగా అదీ వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలేమిటి? ప్రత్యేక వ్యూహాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ సొంత పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ ఆయనకు వెన్నంటి ఉన్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ వ్యాపారాలకు ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయి, జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తరువాత ఏ2గా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంత హఠాత్తుగా విజయసాయి రాజకీయ జీవితం పట్ల వైరాగ్యం ప్రకటించి పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులైతే విజయసాయి రాజీనామా ప్రకటన వెనుక ఉన్నది వైసీపీ అధినేత జగనే అని అంటున్నారు. ఒక విధంగా విజయసాయి రాజీనామా బీజేపీకి జగన్ పంపిన ప్రేమ సందేశం అని కూడా చెబుతున్నారు. వాస్తవానికి విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం వైసీపీ మెరేల్ ను బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. విజయసాయి కూడా వైసీపీని వదిలేస్తే ఇక అసలు ఆ పార్టీలో మిగిలేవారెవరుంటారన్న సందేహం పార్టీ క్యాడర్ లో బలంగా వ్యక్తం అవుతోంది. తన రాజీనామా నిర్ణయం ప్రకటనకు ముందే ఈ విషయం విజయసాయికి తెలుసు అనడంలో సందేహం లేదు. అయినా విజయసాయి ఆ నిర్ణయం తీసుకున్నారంటే.. జగన్ తో ఆయనకు ఇక పూడ్చలేని అగాధమైనా ఏర్పడి ఉండాలి. కానీ జగన్ పట్ల విజయసాయి విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని ఆయన తన రాజకీయ సన్యాసం ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ద్వారా అవతగమౌతోంది. మరి విజయసాయి నిర్ణయానికి కారణమేమిటన్న ప్రశ్నకు.. జగన్ ఆదేశం మేరకే విజయసాయి ఈ నిర్ణయం ప్రకటించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ రాజకీయాలలో వైసీపీకి ఇంక స్పేస్ లేదు. జగన్ ను జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలను నమ్మించి వారి విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు జగన్ ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. తాను కూసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అండ అనివార్యం అని జగన్ కు స్పష్టంగా తెలుసు. అందుకే విజయసాయి చేత రాజీనామా చేయించి జగన్ బీజేపీకి ప్రేమ సందేశం పంపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి బీజేపీలో వెంటనే చేరకపోవచ్చు.. కానీ విజయసాయి రెడ్డి బాటలో ఇతర ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారనీ, వారంతా బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇప్పటికే బీజేపీకి జగన్ పంపారనీ అంటున్నారు. అయోధ్య రామిరెడ్డి రాజీనామా వార్తలు ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. అయోధ్యరామిరెడ్డి తన రాజీనామా వార్తలను ఖండించి ఉండొచ్చు.. కానీ ఆయన చాలా కాలంగా బీజేపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏ విధంగా చూసినా ఇప్పుడు విజయసాయి రాజీనామా వెనుక జగన్ వ్యూహమే ఉందనీ, తనను కేసుల నుంచి కాపాడుకునేందుకు పార్టీని ఫణంగా పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/vijayasai-resignation-jagan-love-message-to-bjp-39-191824.html












