విజయసాయి రెడ్డి రాజకీయ వ్యూహం: మతంతో గేమ్సా?
Publish Date:Oct 8, 2026
Advertisement
వైఎస్ కుటుంబంతో దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన విజయసాయిరెడ్డి, 2024లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించే పనిలో ఉన్నారు.ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి అనుసరిస్తున్న వ్యాహాలు, చేస్తున్న కుల, మత ప్రస్తావనలు సంచలనంగా మారాయి. ఆయన తీరు పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది.విజయసాయి ప్రతి అంశంలోనూ కుల, మత కోణాలను వెలికి తీస్తూ సంచలన రాజకీయమే తన బాణి, వాణి, బాట అని చాటుతున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముస్లింలు, క్రైస్తవులు హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడి ప్రసాదాన్ని గానీ, పవిత్ర వస్త్రాలను గానీ స్వీకరించరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో హిందువులు చర్చిలు లేదా మసీదులకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దళితులను ఆలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే అగ్రవర్ణాల వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తానని ప్రకటించారు. సాధారణంగా లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులపరమైన విభజనలు ఉన్నప్పటికీ, కొన్నేళ్ల క్రితం వరకు మతపరమైన అసమ్మతి లేదా విభేదాల ఛాయలు ఇసుమంతైనా కనిపించేవి కావు. అయితే ఇప్పుడు విజయసాయి రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో.. ఆంధ్రప్రదేశ్‌ను కేవలం రెండు కుటుంబాలు, రెండు వర్గాలు మాత్రమే పాలించాలా? అనే ప్రశ్నను లేవనెత్తారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రి కావాలా? కాపులు, వెలమలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కొత్త పార్టీ ప్రకటనకు విజయసాయి సన్నద్ధమౌతున్న వేళ విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అయితే.. పార్టీ నిర్మాణం, విధివిధానాలు, ప్రధాన రాజకీయ లక్ష్యాలు పూర్తిగా వెల్లడించిన తరువాత మాత్రమే విజయసాయి వ్యాఖ్యల రాజకీయ ప్రభావాన్ని ఏ మేరకు ఉంటుందన్నది తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలక అంశమే. రెడ్డి, కమ్మ, కాపు తదితర సామాజిక వర్గాల రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చ జరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల సందర్భంలోనూ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాల ప్రభావంపై విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అదే అంశాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చారు. అయితే కులం, మతం ప్రస్తావించడం మాత్రమే ఒక కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది అవుతుందా? అంటే పరిశీలకులు ఆ అవకాశం లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు మత ప్రస్తావన, ఏపీ రాజకీయాలలో కొత్త చర్చకు తెరతీశాయని చెప్పవచ్చు. అయితే ఈ రాజకీయ వ్యూహం ఆయన కొత్త పార్టీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. [Vijayasai Reddy Political Strategies, Sai Reddys New Party, Jagan, YCP, TDP, Caste politics, Religious politics, Reddy Vote Bank, AP Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-political-strategies-39-233750.html





