విజయసాయి.. కాషాయం కట్టేయడమే తరువాయి!
Publish Date:Feb 14, 2026
Advertisement
రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డి కమలానికి అనుకూలంగా తన గళాన్ని మరింత బిగ్గరగా వినిపిస్తున్నారు. జగన్ రాజకీయ ప్రవేశం నుంచే కాకుండా, అంతకు ముందు నుంచీ కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, వైసీపీకి రాజీనామా చేయడమే కాకుండా, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా సమయంలో రాజకీయాలకు ఓ దణ్ణం పెట్టేసి.. తాను ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నాననీ, వ్యవసాయమే ఇక తన వ్యాపకమనీ గట్టిగా ప్రకటించారు. అయితే అతి కొద్ది కాలంలోనే ఆయన తన రాజకీయ సన్యాసం నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత కొద్ది కాలం మౌనంగా ఉన్న విజయసాయి.. బీజేపీకి మద్దతుగా తన గొంతు సవరించుకున్నారు. అలాగే వైసీపీపై, జగన్ పై సునిశిత విమర్శలు చేయడం ఆరంభించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ మద్యం కుంభకోణం విషయంలో విజయసాయిరెడ్డి సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లు, కామెంట్లు అన్నీ కూడా ఆయన కషాయ దళంలో చేరనున్నారన్న ప్రచారానికి కారణమయ్యాయి. తాజాగా విజయసాయి రెడ్డి ఆ ప్రచారంలో ఇసుమంతైనా అవాస్తవం లేదనిపించేలా సామాజిక మాధ్యమం వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వందేమాతరం పూర్తిగా పాడాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆ నిర్ణయాన్ని విజయసాయి స్వాగతించడమే కాకుండా భారతీయులంతా సమర్థించి స్వాగతించాలని పిలుపు నిచ్చారు. పనిలో పనిగా విదేశీ మతాలంటూ పరోక్షంగా మతమార్పిడిపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జాతీయ భావం, దేశభక్తి, విదేశీ మతాలు అంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్లు ఆయన కాషాయం కట్టేయడానికి రెడీ అయిపోయారనడానికి నిదర్శనంగా నెటిజనులు పేర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/vijayasai-more-near-to-shaffron-party-39-214089.html





