వైవీ ఫ్యామిలీపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి
Publish Date:Mar 13, 2025
Advertisement
కాకినాడ పోర్టు వాటాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు విచారించారు. విచారణలో సాయిరెడ్డి ఎవరిని ఇరికిస్తారో అని వైసీపీ పెద్దలు భయపడుతూ వచ్చారు.. అనుకున్నట్లు గానే ఆయన జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించే వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు విక్రాంత్‌రెడ్డిపై బాంబులు పేల్చారు. పోర్టు వ్యవహారంలో కీలక పాత్ర విక్రాంత్‌రెడ్డిదే అని విచారణలో వెల్లడించినట్లు సాయిరెడ్డే స్వయంగా చెప్పడం విశేషం. ఆ క్రమంలో విచారణ తర్వాత ఆయన జగన్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యాలు, జగన్ కోటరీని టార్గెట్ చేసిన తీరు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసు లో ఏపీ సీఐడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇచ్చారు. నోటీసులో పేర్కొన్న ప్రకారం విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో సాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు. అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. సీఐడీ కార్యాలయంలోకి విజయసాయి రెడ్డి మినహా ఇంకా ఎవరినీ అధికారులు లోపలకు అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదన్నారు. విజయసాయి రెడ్డి చెప్పే సమాధానాలపై వైసీపీ కీలక నేతల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. విచారణలో ఏం చెబుతారోనని వైసీపీ నేతలు బెంబేలెత్తిపోయారు. ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అనుకున్నట్లే కాకినాడ పోర్టు వాటాల కేసులో బాంబు పేల్చారు. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారన్న అభియోగాలతో విజయసాయిపై కేసు నమోదైంది. కేవీ రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ.. వైసీపీ నేత సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డిని ఏ-2గా, శరత్‌చంద్రారెడ్డి ఏ3గా ఉన్నారు. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించింది. తాజాగా సీఐడీ విచారణలో కేవీ రావుతో వైవీ సుబ్బారెడ్డికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. వైవీ విక్రాంత్‌రెడ్డిని కేవీరావుకి తాను పరిచయం చేసానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డేనని తేల్చి చెప్పారు. ఆ విషయాన్ని విచారణ తర్వాత సాయిరెడ్డి స్వయంగా మీడియాకి వివరించి వైసీపీ నేతల్ని ఉలిక్కి పడేలా చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయటంపై విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కోటరీని ద్వితీయ శ్రేణి నాయకులతో పోల్చిన సాయిరెడ్డి... ఆ ద్వితీయ శ్రేణి నేతలే తనకూ, జగన్‌కి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్‌మోహన్‌రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి, విజయం సాధించారని సాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల పాటు పార్టీలో అవమానాలు పాలయ్యానని.. తను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడిందని జగన్ కోటరీ నేతల్ని దెప్పిపొడిచారు. దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్2గా వెలుగొందారు. పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా చక్రం తిప్పారు. అయితే ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరిగిందో జగన్ ఆయన్ని పక్కన పెడుతూ వచ్చారు. సజ్జలతో పాటు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మాటే జగన్ దగ్గర చెల్లుబాటు అయ్యేదంటారు. ఆ ముగ్గురే జగన్ కోటరీగా ఫోకస్ అయ్యారు. ఆ క్రమంలో కాకినాడ పోర్టు వాటాల కేసులో వైవీ సుబ్బారెడ్డిని డైరెక్ట్‌గా ఇరికిస్తున్న విజయసాయిరెడ్డి.. జగన్ కోటరీని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తుండటం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి తన భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి చేసిన సూచనలను జగన్ పాటిస్తారో లేదో చూడాలి
http://www.teluguone.com/news/content/vijayasai-bomb-on-yv-family-39-194316.html





