విజయ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్...వెలుగులోకి సంచలన విషయాలు
Publish Date:Apr 13, 2026
Advertisement
హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన తల్లి–ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో మృతురాలు విజయరెడ్డి భర్త సురేందర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… “నా భార్య విజయరెడ్డి, మా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నుంచి ఇప్పటివరకు మేమంతా తీవ్ర షాక్‌లోనే ఉన్నాం. అయితే ఈ ఘటనకు నా బామ్మర్ది చిరంజీవి, అత్త పుష్పాలత, అతని భార్య లక్ష్మీ కారణమని అనుమానిస్తున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. “నా భార్య, పిల్లలు చనిపోయి 25 రోజులు గడవకముందే ఆస్తుల విషయంపై నన్ను బెదిరించారు. దీంతో నాకు ప్రాణహాని ఉందని భావించి పోలీసులను ఆశ్రయించాను. ఫిర్యాదు అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు” అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ… “రెండున్నర నెలల క్రితం నా భార్య, పిల్లలు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి నా బామ్మర్ది, అత్త, వారి కుటుంబ సభ్యులు ప్రేరేపించారు. నా భార్య, పిల్లలు అంత పిరికి వారు కాదు. వారి ఆత్మహత్యలపై అనేక అనుమానాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు. “మా కుటుంబ ఆస్తులను నా తరువాత ట్రస్ట్‌కు చెందేలా రాయాలని నిర్ణయించుకున్నాను. చిరంజీవి, పుష్పాలత, లక్ష్మీ నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి రక్షణ కల్పించాలి. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలి” అని పోలీసులను కోరారు. అదే విధంగా, “మా ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్లు, బంగారం తీసుకెళ్లారు. ఆత్మహత్య జరిగిన తర్వాత మా ఇంటికి వచ్చి విలువైన వస్తువులు తీసుకుపోయారు” అని ఆరోపించారు. “నా బామ్మర్ది మరియు అతని పరిచయస్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఉప్పల్‌లో రూ.30 లక్షలతో ఇల్లు కొనుగోలు చేయడానికి నా భార్య ఒప్పందం చేసుకుంది. ఆమె మరణించిన నెలరోజుల తర్వాత చిరంజీవి బిల్డర్ దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ కాపీలు నాకు ఇవ్వకుండా నన్ను బెదిరిస్తూ సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు” అని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని, ప్రాణ రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి పోలీసులను వేడుకున్నారు.
http://www.teluguone.com/news/content/vijaya-shanthi-reddy-36-217249.html





