యూటర్నా.. వెనకడుగా.. 24 గంటల్లో మారిన విజయసాయి వైఖరి
Publish Date:Apr 13, 2026
Advertisement
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ఇక మీడియా సంస్థ ద్వారా ప్రజాసేవ చేస్తానని చెప్పుకున్నారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, పూర్తి తటస్థంగా వార్తలను అందిస్తామని హామీ ఇచ్చారు.అయితే ఆయన మీడియా సంస్థ ప్రకటన చేసి, తాను తటస్ఠంగా ప్రజా పక్షాన గొంతెత్తుతానని ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఆయన వైఖరి మారింది. తటస్థం అన్నది ఒక ముసుగే అని అవగతమయ్యేలా ఆయన సోషల్ మీడియా పోస్టులు ఉంటున్నాయి. డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు. తద్వారా తాను పాత విజయసాయిరెడ్డినేనని పరోక్షంగా, అన్యాపదేశంగా చాటుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో విజయసాయి గంతంలో అంటే వైసీపీలో ఉన్న సమయంలో ఏ వైఖరినైతే అవలంబించారో.. ఆ వైఖరికి అనుగుణంగానే ఆయన తాజా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అంతెందుకు ఆయన మీడియా సంస్థ ప్రారంభిస్తున్నానన్న ప్రకటనకు ముందు అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందగానే ఆయన కమ్మరావతి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తటస్థ మీడియా సంస్థ ప్రారంభిస్తున్నానని చెప్పిన 24 గంటల వ్యవధిలోనే విజయ సాయి తన జగన్ అనుకూల వైఖరిని వెల్లడించుకుంటూ, రామచంద్రయాదవ్ కు మద్దతు పలుకుతూ చేసిన ట్వీట్లు ఆయన తటస్థతపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా ఉన్నాయి. తన మీడియా సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఆయన అనుసరిస్తున్న ఈ వైఖరి.. రానున్న రోజులలో ఆయన మీడియా ఎవరి కోసమే చెప్పకనే చెబుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/vijaya-sai-reddy-uturn-on-retreat-25-217218.html





