ఎన్టీఆర్ తరువాత విజయే!
Publish Date:May 4, 2026
Advertisement
సినిమాల్లో అగ్రహీరోగా రాణించి.. రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడమనేది సాధారణ విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తలపండిన నేతలకు ధీటుగా నిలబడి.. ప్రచారాలు చేసి, పార్టీని అధికారంలో నిలబెట్టిన ఘనత ఆనాటి నందమూరి తారకరామారావుకే చెందుతుంది. ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనం. భారత రాజకీయ చరిత్రలో సినీ గ్లామర్‌కు, రాజకీయ పీఠానికి విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెండితెర వేల్పులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా, అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది మాత్రం ఒక అద్భుతం. నాడు ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు సృష్టించిన ఆ ప్రభంజనాన్ని, నాలుగు దశాబ్దాల తర్వాత నేడు తమిళనాడులో నటుడు విజయ్ పునరావృతం చేశారు. తమిళనాడు రాజకీయ యవనికపై నూతన శకం ఆరంభమైంది. ఐదు దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే సాగుతున్న అధికార మార్పిడికి చెక్ పెడుతూ.. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని దక్కించుకుని రికార్డు సృష్టించారు. ఆ తరువాత విజయ్ కూడా అలాగే పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే తమిళ గడ్డపై రాజకీయ ప్రభంజనాన్నిసృష్టించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుండి టీవీకే అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం ఈ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రనేతలు పోటీ చేసిన స్థానాల్లో సైతం టీవీకే అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించడం గమనార్హం. విజయ్ తన ప్రచారంలో చాటిన సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన నినాదాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును విజయ్ చీల్చడమే కాకుండా, తటస్థ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారని ఈ ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా.. దక్షిణాది రాజకీయాల్లోనే ఒక పెద్ద మార్పుగా భావించవచ్చు. ప్రాంతీయ పార్టీల బలం తగ్గుతున్న తరుణంలో.. ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఈ స్థాయి విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా చర్చనీయాంశంగా మారింది. టీవీకే విజయంతో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి వేగంతో అధికారాన్ని అందుకున్న నాయకుడిగా విజయ్ పేరు చరిత్రలో నిలిచిపోనుందంటున్నారు. ఎన్టీఆర్ తరువాత విజయ్ కు ముందు రాజకీయ పార్టీలు పెట్టి ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడిన సినీ తారలు చాలా మందే ఉన్నారు. అయితే వారెవరూ కూడా విజయ్ లా విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు. 2005లో పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విజయ్ కాంత్.. ఆ ఎన్నికలలో ఆక్ష్న ఒక్కరే గెలిచారు. 2011లో ప్రతిపక్ష నేత స్థాయికి ఎదిగినా అధికారానికి దూరంగానే ఉండిపోయారు. ఆ తరువాత చిరంజీవి 2009లో భారీ అంచనాలతో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 18 సీట్లు గెలుచుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోలేక చివరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తరువాత 2014లో పవన్ కల్యాణ్ పార్టీ పెట్ట.. , 2019లో తొలిసారి పోటీ చేస్తే కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు. అయితే ఆ తరువాత 2024 ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 స్థానాలలోనూ పార్టీని గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక 2018 కమల్ హసన్ సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించిన.. ఇంత వరకూ జరిగిన ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. అయితే విజయం మాత్రం 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి.. రెండేళ్లలోనే అంటే 2026 అసెంబ్లీ ఎన్నికలలో 105కుపైగా స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి కాబోతున్న స్టార్ హీరోగా విజయ్ చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు.
సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని విజయ్ కొనసాగిస్తున్నారని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, గత నేతల కంటే భిన్నంగా విజయ్ ఆధునిక రాజకీయ పోకడలను, టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు చేరువయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు.. మార్పు కోరుకునే ఓటర్లందరూ టీవీకే గుర్తుకే ఓటు వేశారని ఈ ఫలితాలు విస్పష్టంగా చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/vijay-emerged-as--only-hero-since-ntr-25-218928.html





