Indrakeeladri: కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న విరోష్ జంట.!
Publish Date:Oct 17, 2026
Advertisement
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు. శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వారికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆలయ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. తమ అభిమాన నటీనటులను చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగడంతో అక్కడ ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరచడంతో ఇంద్రకీలాద్రిపై సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా 'రణబాలి' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో నటి రష్మిక మందన్న ఈ మూవీ సక్సెస్ పట్ల, తన భర్త విజయ్ నటన పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. విజయ్ నటనకు తాను ఎప్పటినుంచో అభిమానినని, భవిష్యత్తులోనూ అభిమానిగానే కొనసాగుతానని ఆమె తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ సినిమా తాను పోషించిన 'జయమ్మ' పాత్ర గురించి రష్మిక ప్రత్యేకంగా ప్రస్తావించారు. "జయమ్మ.. ఆమె ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఒక నిజమైన మహిళ ఎలా ఉండాలో, తన వాళ్ల కోసం ఎలా నిలబడాలో, వారిని ఎలా కాపాడుకోవాలో ఆ పాత్ర నాకు నేర్పింది" అని రష్మిక పేర్కొన్నారు. [ Vijay Deverakonda, Rashmika Mandanna, Kanaka Durga Temple, Kanaka Durga Ammavari Temple, Ranbali movie, Indrakeeladri, Vijay Rashmika Temple Visit, Vijay Deverakonda Latest News, Rashmika Mandanna Latest News,Telugu One, Telugu news ]
http://www.teluguone.com/news/content/vijay-deverakonda-25-234697.html





