వేణు స్వామి అరెస్టుకు రంగం సిద్ధం?
Publish Date:Aug 12, 2024
Advertisement
జ్యోతిషం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కామెంట్ చేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే ‘సంఘ విద్రోహశక్తి’గా మారిన వేణు స్వామిని అరెస్టు చేసి, బాగా తోమడానికి రంగం సిద్ధం అవుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద జ్యోతిషం పేరుతో వంద రాళ్ళు విసిరి, ఏదో ఒక రాయి తగలగానే ‘చూశారా నా పాండిత్యం’ అంటూ రెచ్చిపోయే వేణు స్వామి, ఆమధ్య రాజకీయంగా కూడా దిక్కుమాలిన జోస్యాలు చెప్పి అభాసు పాలయ్యాడు. ఎప్పటికప్పుడు ఇక జోస్యాలు చెప్పను అంటూనే, పలువురు సెలబ్రిటీల గురించి దారుణంగా జోస్యాలు చెబుతూ నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నాడు. నటి సమంతతో వివాహం విఫలమైన చాలాకాలం తర్వాత, అక్కినేని నాగ చైతన్య మళ్ళీ తన వైవాహిక జీవితాన్ని నిర్మించుకోవడానికి ముందడుగు వేశారు. నటి శోభిత ధూళిపాళతో కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. అంతే, తనకు మళ్ళీ మేటర్ దొరికిందని ఆనందపడిన వేణు స్వామి మళ్ళీ తన జ్యోతిష వికృత రూపాన్ని చూపించాడు. ఈ జంట కూడా ఎక్కువకాలం కలసి వుండదని అంటూ, శుభమా అని నిశ్చితార్థం జరుపుకుంటున్న ఈ జంట మీద నానారకాల చెత్తవాగుడు వాగాడు. ఈ బురదలో దొర్లే పంది జోలికి వెళ్తే మనమీదే బురద పడుతుందని సెలబ్రిటీలు ఇతను ఎంత చెత్తవాగుడు వాగినా బహిరంగంగా స్పందించకుండా వున్నారు. దీన్ని అలుసుగా తీసుకున్న వేణు స్వామి తనకు తిరుగే లేదన్నట్టు.. తననెవరూ ఏమీ చేయలేరన్నట్టు రెచ్చిపోతున్నాడు. సమంత - నాగచైతన్య పెళ్ళి అవగానే ఈ దుర్మార్గుడు చెత్త ఊహాగానాలు మొదలుపెట్టాడు. ఈ జంట విడిపోతుంది.. విడిపోతుంది.. అని తగులుకున్నాడు. ఒక్కసారి ఈ వాడుగు వాగిన తర్వాత సోషల్ మీడియా ఊరుకుంటుందా.. అదే పాయింట్ మీద ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది. ఇతగాడు వాగిందే వాగాడు.. చివరికి వేణు స్వామి దిష్టి తగిలిందో ఏమోగానీ, చక్కగా వున్న నాగచైతన్య, సమంత సంసారం ముక్కలైపోయింది. అప్పటి నుంచి వేణు స్వామికి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే అయింది. ‘‘నేను చెప్పినట్టే జరిగింది చూశారా’’ అని కాలర్ ఎగరేసి తిరగడం మొదలుపెట్టాడు. ఇలా సెలబ్రిటీల జీవితాల గురించి, కెరీర్ గురించి తన నోటికొచ్చింది వాగితే సోషల్ మీడియాలో బాగా కవరేజ్ వస్తుందన్న సీక్రెట్ తెలుసుకున్న వేణు స్వామి ఆగడాలకు ఆ తర్వాత అంతే లేకుండా పోయింది. సాధారణంగా పండితులు అయినవారి నోటి నుంచి శుభమే బయటకి రావాలి. ఈ వేణు స్వామి పండితుడు కాబట్టి ఎప్పుడు నోరు తెరిచినా నోటి నుంచి అశుభమే. ఫలానా హీరో కెరీర్ నాశనమైపోతుంది. ఒక హీరో త్వరలో చనిపోబోతున్నాడు. ఫలానా హీరోకి పెళ్ళి కానేకాదు.. ఇలాంటి దరిద్రమే వేణు స్వామి నోట్లోంచి వస్తూ వుంటుంది. ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల వచ్చిన దిక్కుమాలిన పబ్లిసిటీని వేణుస్వామి కమర్షికయల్‌గా టర్న్ చేశాడు. తనతో పూజలు చేయించుకుంటే కెరర్ అద్భుతంగా మారుతుందని ప్రచారం చేసుకున్నాడు. హైక్లాస్ జ్యోతిషుడిగా చెలామణి అవుతూ, లక్షలకొద్ది డబ్బు సంపాదిస్తున్నాడు. విడిచేసినోడు వీధికి పెద్ద అన్నట్టుగా సిగ్గూ, అభిమానం వదిలేసిన ఇతగాడే పెద్ద జ్యోతిషుడిలా చెలామణి అవుతున్నాడు. ఈ వాచాలుడి ప్రచారం, పటాటోపం చూసి మోసపోయిన కొంతమంది హీరోయిన్లు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి ఇతగాడి చేత పూజలు చేయించుకున్నారు. అలా పూజలు చేయించుకుంటున్న ఫొటోలను బయటకి రిలీజ్ చేసి, వాటి ద్వారా కూడా పబ్లిసిటీ పొందిన ప్రచార పిశాచి ఈ వేణు స్వామి. పిచ్చోడి చేతికి రాళ్ళిచ్చి కొట్టమంటే, వంద రాళ్ళలో ఒకటో రెండో లక్ష్యాన్ని తాకుతాయి. ఇలాగా ఈ జ్యోతిషం పిచ్చోడు విసిరిన భవిష్యత్తు ఊహాగానాల రాళ్ళలో లక్ష్యాలను చేరిన రాళ్ళు ఒకటో రెండో.. మిగతావన్నీ గురితప్పిన రాళ్ళే. వాటిల్లో కొన్ని శాంపిల్ రాళ్ళని పరిశీలిస్తే.... ప్రభాస్‌కి అసలు హిట్టే రాదని ఈ వీరుడు చెప్పాడు. నిన్నగాక మొన్నే ‘కల్కి’ మూవీ వెయ్యికోట్ల వ్యాపారం చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుందని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మళ్ళీ గెలుస్తాడని, వరల్డ్ కప్‌లో ఇండియా గెలుస్తుందని.. ఇలా ఒకటి కాదు.. ఎన్నెన్నో ఫెయిల్యూర్ ఊహాగానాలు చేశాడు. వాళ్ళు, వీళ్ళు అని కాదు.. ఎవరు లైమ్‌లైట్లో వుంటే వాళ్ళ మీద తనకు తోచిన ఊహాగానాన్ని, వాళ్ళు బాధపడే విధంగా చెప్పేస్తాడు. తాను చెప్పింది జరిగితే ‘‘చూశారా నా పవర్’’ అంటాడు. జరక్కపోతే, ‘‘చెప్పినవన్నీ జరగాలని రూలేమీ లేదు’’ అంటాడు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే, నాకు జ్యోతిషం రాదు... ఇక నేను ఎవరి గురించీ చెప్పను అని తప్పించుకుపోతాడు. కొంతకాలం గడిచిన తర్వాత కుక్కతోక వంకర అన్నట్టు.. వేణు స్వామి నోరు టింకర అవుతూ వుంటుంది. కొద్ది రోజుల క్రితం నేను రాజకీయ జోస్యాలు, సెలబ్రిటీల వ్యక్తిగత జోస్యాలు చెప్పను అని వేణు స్వామి నమ్మకంగా చెప్పాడు. ఎప్పుడైతే నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిందో, వెంటనే వేణు స్వామిలో వున్న పిశాచం బయటకి వచ్చింది. వెంటనే వీళ్ళ వైవాహిక జీవితం ఎలా వుంటుందనే దాని మీద పెద్ద వీడియో విడుదల చేశాడు. శుభమా అని ఒకటవబోతున్న ఆ జంట భయపడిపోయేలా ఆ వీడియో వుంది. వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగిన ముహూర్తం ప్రకారం ఈ సొల్లుగాడు చేంతాడంత సుత్తి చెప్పాడు. పైగా చెప్పిందంతా నెగటివ్ విషమే తప్ప.. ఒక్క మంచి విషయం కూడా లేదు. అంతా చెప్పి, నాకు వాళ్ళ మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు.. ఇలా జరుగుతుందని చెప్పాను అంతే, నేను చాలా మంచివాణ్ణి అని కవరింగ్ కూడా చేసుకున్నాడు. అసలు తమ జీవితం ఎలా వుండబోతోందని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఏమైనా అడిగారా? వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఈ పోరంబోకోడి ఊహాగానాలు ఎందుకట? ఇంతకాలం వేణు స్వామి ఆగడాలను జనం భరిస్తూ వచ్చారు. వేణు స్వామిని మొరిగే కుక్కలాగానే భావిస్తూ వచ్చారు. మొరిగినంత సేపు మొరిగి ఊరుకుంటుందని అనుకున్నారు. కానీ, అలా మొరిగీ మొరిగీ ఈ మొరిగే కుక్కకి పిచ్చిపట్టిందని జనానికి అర్థమైపోయింది. పిచ్చికుక్కకి ఎలాంటి సత్కారం లభిస్తుందో అలాంటి సత్కారం ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వేణు స్వామి వాచాలత్వం మీద భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి. ఇతని నోరు మూయించాల్సిన అవసరం వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో వేణు స్వామి మీద సెలబ్రిటీలు కేసు పెట్టకపోయినా, వేరే దారిలో కేసులు పెట్టించి, లోపల వేసి ‘రాయల్ ట్రీట్‌మెంట్’ ఇచ్చి, ఇక జీవితంలో నోరు తెరవకుండా చేసే వ్యూహ రచన జరుగుతోంది. తన అరెస్టుకు రంగం సిద్ధం అవుతోందని అర్థం చేసుకున్న వేణు స్వామి మళ్ళీ కాళ్ళ బేరాలు ప్రారంభించాడు. తాను రాజకీయాల గురించి, సెలబ్రిటీల గురించి మాట్లాడనని చెబుతూ ఒక వీడియో లేటెస్ట్.గా విడుదల చేశాడు. గతంలో కూడా తాను ఇలాగే చెప్పానని, అయితే, గతంలో తాను నాగ చైతన్య, సమంత గురించి చెప్పాను కాబట్టి, మళ్ళీ నాగ చైతన్య పెళ్ళి జరగబోతోంది కాబట్టి దానికి కొనసాగింపుగా చెప్పానే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని చచ్చు రీజనింగ్స్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. తాను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో కూడా మాట్లాడానని, ఇకపై ఎవరి గురించి జోస్యాలు చెప్పనని మాట ఇచ్చానని, ఆ మాటకి కట్టుబడి వుంటానని చెప్పుకొచ్చాడు. కుక్కతోక లాంటి వేణు స్వామి ఎంత నక్క వినయం ప్రదర్శించినప్పటికీ, అతనికి బుద్ధి వచ్చేలా చేసే ప్రణాళిక రచన మాత్రం ఆగనట్టు తెలుస్తోంది. త్వరలో వేణు స్వామి అరెస్టు, రిమాండ్ అనే శుభవార్త తెలుగు వాళ్ళు వినబోతున్నారు. కాకపోతే, తనకు చిప్పకూడు తినే రోజు వస్తుందని వేణు స్వామి గతంలో ఎంతమాత్రం ఊహించి వుండడు. ఎందుకంటే, అతనికి అసలు జ్యోతిషమే రాదు కాబట్టి.
http://www.teluguone.com/news/content/venu-swamy-to-be-arrested-25-182830.html





