కాంగ్రెస్ పార్టీపై అవినీతి పిడుగు
Publish Date:Dec 31, 2013
Advertisement
కాంగ్రెస్ పార్టీకి అవినీతికి ఉన్నఅవినాభావ సంబంధం గురించి ప్రజలకు కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలంలో యువరాజు రాహుల్ గాంధీ వారికి అవినీతి పూనకం (అంటే అవినీతికి వ్యతిరేఖంగా లెక్చర్లు ఇవ్వడం) రావడంతో, కొంపదీసి ఆయన మాటలకు తలొగ్గి కాంగ్రెస్ నేతలందరూ నిజంగానే అవినీతిని విడిచిపెట్టేయబోతున్నారా? అని ప్రజలు ఒకటే అనుమానంపడిపోసాగారు. కానీ, మీకా భయం అక్కరలేదని కాంగ్రెస్ తరపున బీజేపీ నేతలు లికితపూర్వకంగా హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన అర్ధాంగి ప్రతిభా సింగ్ ఇద్దరూ కూడా గతంలో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించలేక చేతేలేత్తేసిన వెంచర్ ఎనర్జీ కంపెనీ అనే ఒక ప్రైవేట్ విద్యుత్ సంస్థ వద్ద నుండి రూ.1.5కోట్లు, రూ.2.4 కోట్లు (మాత్రమే) ముడుపులు పుచ్చుకొని, దానికి మళ్ళీ పనులు మొదలుపెట్టడానికి అనుమతులు మంజూరు చేసారని, అంతే గాక సదరు కంపెనీకే చెందిన వేరే సంస్థ- తరిణి ఇన్ఫ్రా కంపెనీలో వీరభద్ర సింగ్ భార్య, కుమారుడు విక్రమాదిత్య సింగ్, కుమార్తె అపరాజిత కుమారిలు వాటాదారులుగా ఉన్నారని అన్ని ఆధారాలతో సహా బీజేపీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి పది పేజీల లేఖ వ్రాసిపడేసి, ఈ అవినీతి భాగోతం గురించి గురించి సోనియా, రాహుల్ గాంధీలు ఏమి జవాబు చెప్తారంటూ ప్రశ్నిస్తోంది. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కోరిన రాహుల్ గాంధీ మరి వీరభద్ర సింగ్ ముడుపుల వ్యవహారంపై కూడా పెదవి విప్పుతారా లేదా? అని బీజేపీ నిలదీస్తోంది. అయితే షరా మామూలుగానే కాంగ్రెస్ ముందుగా ఆ ఆరోపణలను గట్టిగా ఖండించేసి పడేసింది. మరీ అంత ముచ్చటాగా ఉంటే ఆ కాయితాలు, సాక్ష్యాలు పట్టుకొని ఏ కోర్టుకో సీబీఐ దగ్గరకో వెళ్ళండి కానీ మమ్మల్ని మాత్రం విసిగించొద్దని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది. అదేవిధంగా వీరభద్ర సింగ్ కూడా నేను, నా పెళ్ళాం పిల్లలు ఏ పాపం ఎరుగమని, కావాలంటే ఏ విచారణకయినా సిద్దం అని ఒక ఖండన ప్రకటన ఒకటి పడేసి చేతులు దులుపుకొన్నారు. ఇక మరో నాలుగు నెలలో దిగిపోయేవాడిని నాకెందుకు ఈ గొడవ? అనుకొంటూ మన్మోహన్ సింగ్ తన మౌనవ్రతంలో మునిగిపోయారు. కానీ, బీజేపీ మాత్రం ఇంతవీజీగా నిన్నొదల బొమ్మాళీ అంటూ కాంగ్రెస్ వెంట పడుతూ ఒకటే వేదిస్తోంది. ఇదంతా చూసి రాహుల్ గాంధీకి గానీ మళ్ళీ మూడొచేస్తే తనకు మూడుతుందని పాపం వీరభద్ర సింగ్ బిక్కుబిక్కుమంటూ డిల్లీ వైపు చూస్తున్నాడు.
http://www.teluguone.com/news/content/veerabhadra-singh-39-28904.html