చంద్రబాబుకున్న మనోబలం.. వంశీకి లేదా?
Publish Date:Mar 27, 2025
.webp)
Advertisement
జైల్లో గడపవలసి రావడమే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటిది సింగిల్ బ్యారక్ లో ఒంటరి గా ఉండాలంటే చాలా కష్టం. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడ కూడా కొత్త తప్పులు చేసిన వారిని, తీవ్రమైన నేరాలు చేసినవారిని ఇటువంటి సాలిటరీ సెల్ లలో ఉంచుతారు. అలాగే సెలబ్రిటీలు ఇతరులతో కలిపి ఉంచడం వలన వారికి ప్రమాదం ఉంటుందనే అనుమానం ఉంటే.. వాళ్ళను కూడా ఒక సెల్ లో ఒంటరిగా ఉంచుతారు. ప్రస్తుతం దళిత యువకుడు సత్యావర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విధంగా సింగిల్ బ్యారెక్ లో ఒంటరిగా ఉంటున్నారు. సెల్ లో ఒక్కడినే ఉండలేకపోతున్నాను.. తనకు తోడుగా మరొక ఖైదీని ఉంచాలని ఆయన కోర్టును పదేపదే వేడుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీకి నాయకుడిగా ప్రముఖ వ్యక్తి కావడం వలన ఆయన భద్రతా కారణాల దృష్ట్యా మరొక ఖైదీని అక్కడ ఉంచలేం అని జైలు అధికారులు చెప్పడంతో కోర్టు కూడా అనుమతించడం లేదు. రిమాండు పొడిగింపు కోసం న్యాయమూర్తి ఎదుటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జైల్లో తనకు తోడు కావాలని వంశీ అడగడం, ఆ కోరిక నెరవేరకపోవడం జరుగుతూనే ఉంది.
ఇదంతా నేపథ్యం అనుకుంటే.. ఇప్పుడు అసలు సంగతి ప్రస్తావించుకోవాలి! ముందే చెప్పుకున్నట్టు ఒక సెల్ లో ఒంటరిగా ఉండడం అనేది నిజంగానే కష్టం! అయితే అలా ఉండడానికి ఎంతో దృఢమైన మానసిక బలం ఉండాలి. ఒక టర్మ్ రిమాండ్ పూర్తి అయిన నాటి నుంచి తనకు తోడు కావాలని గోల ప్రారంభించిన వంశీ ఇలాంటి మానసిక బలం విషయంలో చాలా వీక్ గా ఉన్నారని అనుకోవాల్సి వస్తోంది.
గతంలో జగన్ పాలనలో చంద్రబాబునాయుడడిని అరాచకంగా అరెస్టు చేసి.. చాలా దుర్మార్గమైన రీతిలో రోడ్డు మార్గంలో తరలించి మొత్తానికి ఆయనను 53 రోజుల పాటు సెంట్రల్ జైలులో నిర్బంధించారు. తనను అరెస్టు చేసిన ప్రభుత్వ అరాచకత్వాన్ని చంద్రబాబునాయుడు ప్రశ్నించారే తప్ప.. జైలులో తనకు తోడు కావాలని మొర పెట్టుకోలేదు. వయసు రీత్యా డెబ్భయ్యేళ్లు దాటిన చంద్రబాబునాయుడుకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను మాత్రం కోర్టు కల్పించింది. ఆ విషయానికి వస్తే.. వల్లభనేని వంశీ విన్నవించుకున్న తర్వాత.. ఆయనకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇనుప మంచం ఇబ్బందికరంగా ఉందని అంటే.. పరుపు, దిండు కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రశ్నించినప్పుడు.. అవన్నీ సౌకర్యంగానే ఉన్నాయని ఒప్పుకున్న వల్లభనేని వంశీ జైలు బ్యారెక్ లో తనకు ఒక తోడు కావాలని ఆరాటపడడమే ఆయన మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. ఆ మాటకొస్తే 2014కు పూర్వం జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన బ్యారెక్ లో మరొకరు తోడు ఉన్నారు.
కానీ.. చంద్రబాబునాయుడు ఏకంగా 53 రోజులు జైల్లో ఉన్నప్పటికీ.. తోడు అడగలేదనే సంగతిని గమనించాలి. ఆయన మానసిక దారుఢ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నిజానికి చంద్రబాబు వయస్సు ఎక్కువ అయినప్పటికీ.. శారీరకంగా చాలా ఫిట్ గా ఉంటారు. ఆయన వయసు గురించి జగన్ హేళన చేసినప్పుడు.. ఇద్దరం కలిసి నడుద్దాం.. ఎవరు ఎక్కువ దూరం నడవగలరో కూడా చూద్దాం అంటూ చంద్రబాబు సవాలు చేశారు కూడా. చంద్రబాబుకు ఉండే మానసిక బలం.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలచుకోవడం, నిబ్బరంగా ఉండడం, ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధికి పదును పెట్టుకోవడం వంటి విషయాలను చంద్రబాబును చూసి వంశీ లాంటి నాయకులంతా నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/vanshi-lacks-mental-stability-25-195120.html












