బోత్ ఆర్ నాట్ సేమ్.. మంత్రి నారాయణ
Publish Date:Jan 12, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాలు సమానం కాదనీ, వెటికవి డిఫరెంట్ అని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ తరచుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను, వాటికి అయిన వ్యయాన్నీ పోలుస్తూ చంద్రబాబు సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు. అమరావతి సచివాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామనీ, ఇది ముఖ్యమంత్రి కార్యాలయం సహా, ఇందులో మంత్రులు, కార్య దర్శులు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయనీ, మొత్తం పాలనాయంత్రాంగాన్ని ఒకే గూటి కిందకు తెస్తున్నామన్నారు. అదే తెలంగాణ సచివాలయంలో అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు మాత్రమే ఉంటాయనీ, శాఖాధిపతులు, సిబ్బంది కార్యాల యాలు వేరే చోటనుంచి పని చేస్తాయన్నారు. అయితే అమరావతి సచివాలయం అయితే కార్పొరేషన్లు, వాటి శాఖలతో సహితంగా ఇక్కడే ఉంటా యన్నారు. పాలనా సౌలభ్యం లక్ష్యంగా అమరావతి సచివాలయ నిర్మాణం ఉంటుందన్నారు. ఇది పాలనను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. ఇవేమీ అవగాహన లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అజ్ణానంతో, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందుగా అమరావతి ప్రాజెక్టును పూర్తిగా అవగాహన చేసుకుని ఆ తరువాత మాట్లాడాలని సజ్జలకు సూచించారు. ప్రపంచంలోని ఐదు టాప్ నగరాలలో ఒకటిగా అమరావతి అభివృద్ధి చేస్తున్నామన్న నారాయణ ఇక్కడ డ్రైనేజి వ్యవస్థలు, తాగునీటి పైప్ లైన్ లు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ కేబుల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న స్పష్టమైన విజన్ తో ముందుకు సాగుతున్నదన్నారు. రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా ఆమోదించిన జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాట మెదలెట్టారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ ఆయన చేసిన విన్యాసాల వల్ల అమరావతిని భూములిచ్చిన రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమరావతి రాజధాని అభివృద్ధి పట్ల రైతులు, మహిళలూ ఆనందంగా ఉన్నారని మంత్రి నారాయణ చెప్పారు. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని నారాయణ స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/minister-narayana-condemn-ycp-comparism-between-ap-25-212415.html





