వైభవ్ సూర్యవంశీ ఊచకోత...11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
Publish Date:Jun 21, 2026
Advertisement
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. కేవలం 15 ఏళ్ల వయసున్న భారత యువ సంచలనం, బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక-ఎ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, ఇండియా-ఎ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొని లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన ప్రతీకార గాథ దాగి ఉంది. ఈ టోర్నమెంట్‌లో అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తక్కువ పరుగులకే అవుట్ అయినప్పుడు, శ్రీలంక ఆటగాళ్లు అతనిపై స్లెడ్జింగ్‌కు దిగారు. 'ఇది ఐపీఎల్ కాదు, మీ ఇంటికి వెళ్ళిపో' అంటూ ఎగతాళి చేశారు. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ముగియడం, అందులో శ్రీలంక గెలవడంతో ఇరు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఆ అవమానాన్ని మనసులో ఉంచుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, ఫైనల్ మ్యాచ్‌లో తన బ్యాట్‌తోనే వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బౌలర్ ఎవరైనా, వేగం ఎంతైనా సరే లెక్కచేయకుండా బంతిని స్టేడియం దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొహమ్మద్ షిరాజ్ వేసిన రెండో ఓవర్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు రాబట్టి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దులాజ్ సముదిత వేసిన బంతిని లాంగ్-ఆన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలచి కేవలం 11 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 2005-06 సీజన్‌లో శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే రాగమ క్రికెట్ క్లబ్ తరపున 12 బంతుల్లో నెలకొల్పిన 20 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 29 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 94 పరుగులు చేసి సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఒకవేళ ఆ 29వ బంతికి అవుట్ కాకుండా సిక్సర్ కొట్టి ఉంటే, లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ రికార్డును సమం చేసేవాడు. అయినప్పటికీ, అతని స్ట్రైక్ రేట్ మరియు బౌండరీల వర్షం మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. అంతకుముందు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్, ఈ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.
http://www.teluguone.com/news/content/vaibhav-suryavanshi-36-223672.html





