నిండుకుంటున్న అమెరికా ఆయుధ నిల్వలు.!
Publish Date:Aug 9, 2026
Advertisement
ఇరాన్ యుద్ధం అమెరికాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. అగ్రరాజ్యం ఇరాన్ యుద్ధం కారణంగా ఇటు ఆర్థికంగానూ, అటే ఆయుధ నిల్వల పరంగానూ కూడా సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఇరాన్ యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యాన్నిదారుణంగా దెబ్బ తీసింది. ఈ యుద్ధం కారణంగా అమెరికా అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు, వ్యూహాత్మక ఆయుధాలను భారీగా ఉపయోగించాల్సి రావడంతో.. ఆ దేశం వద్ద ఉన్న ప్రధాన క్షిపణి నిల్వలు నిండుకుంటున్నాయి. అమెరికా రక్షణ సామర్థ్యానికి వెన్నెముకగా నిలిచే ఇంటర్‌సెప్టర్లు ఖాళీ అయిపోయాయి. ఇది ఆ దేశాన్ని ఆందోళన కు గురి చేస్తోంది. అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ఇందుకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఇరాన్ పై యుద్ధ చర్యల కారణంగా అమెరికా ఆయుధాగారంలో పేట్రియాట్, థాడ్ వంటి మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ల సంఖ్య కనిష్ట స్థాయికి పడిపోయిందని ఓ ఇంటర్వ్యేలో వెల్లడించారు. ఆయుధ నిల్వల క్షీణత కారణంగా ప్రపంచంలో ఎదురయ్యే ఇతర రక్షణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సంసిద్ధత అమెరికాకు లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం అమలు చేసిన స్ట్రాటజిక్ విధానాలు, ఉక్రెయిన్ పోరుకు భారీగా ఆయుధ సహాయం అందించడం, ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలపై ప్రభావం చూపాయన్న మార్క్ ఎస్పర్.. ఈ ఆయుధ కొరత అమెరికాను బలహీనపరుస్తోందనీ, అదే సమయంలో ఈ పరిస్థితి చైనా వంటి దేశాలకు తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అదలా ఉంటే.. ఒక్క పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని నిర్మించడానికి రెండేళ్ల సమయం పడుతుంది. అందువల్ల ప్రభుత్వం ఎన్ని అత్యవసర నిధులు విడుదల చేసినప్పటికీ.. ఆయుధ కొరతను అధిగమించడం అమెరికాకు ఇప్పటికిప్పుడు సాధ్యపడే పరిస్థితి లేదు. పశ్చిమాసియా యుద్ధంలో పేట్రియాట్, థాడ్ వ్యవస్థలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను నిరోధించడానికి పేట్రియాట్ వ్యవస్థ ఉపయోగపడుతుండగా, బాలిస్టిక్ క్షిపణులను అంతరిక్ష సరిహద్దుల్లోనే కూల్చివేసేందుకు థాడ్ డిఫెన్స్ సిస్టమ్ దోహదం చేస్తున్ననది. ఇరాన్ వరుస మిస్సైల్ దాడుల నుంచి తమ స్థావరాలను, మిత్రదేశాలను కాపాడుకోవడానికి అమెరికా వీటిపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు వాటి నిల్వలే దాదాపు అడుగంటి పోవడంపై అగ్రరాజ్యంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. క్షీణిస్తున్న ఆయుధ నిల్వలను పునరుద్ధరించడానికి పెంటగాన్ అదనంగా 67 బిలియన్ డాలర్ల బడ్జెట్ ప్రతిపాదించగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ క్రిస్ మర్ఫీ అయితే.. ఇప్పటికే త టోమాహాక్, ఇంటర్‌సెప్టర్ క్షిపణులను దాదాపుగా వాడేశామని, ఇరాన్‌తో యుద్ధం ముగిసే వరకు ఇక అదనపు సైనిక నిధులను ఆమోదించడం కరెక్ట్ కాదంటున్నారు. అయితే.. రిపబ్లికన్ సెనేటర్ జిమ్ బ్యాంక్స్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇరాన్ విధానాలకు మద్దతు,. ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రాధాన లక్ష్యమంటూ.. అందుకు సైనిక చర్యలు అనివార్యమన్నారు. మొత్తానికి ఇరాన్ తో యుద్ధం అమెరికాను చిక్కుల్లో పడేసిందని చెప్పక తప్పదు. US Iran War, Patriot Missile System, THAAD Interceptors, Mark Esper Defense, Pentagon Weapons Shortage
http://www.teluguone.com/news/content/us-iran-war-36-228489.html





