అమెరికా, ఇరాన్.. మళ్లీ శాంతి చర్చలు.. ఈ సారైనా ఫలిస్తాయా?
Publish Date:Apr 14, 2026
Advertisement
ఉప్పు నిప్పులా ఉండే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు చిగురంత ఆశను రేకెత్తిస్తున్నాయి. దశాబ్దాల సంక్షోభానికీ, శత్రుత్వానికీ ఎండ్ కార్డ్ వేసే దిశగా ఈ చర్చలు సాగాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. పాకిస్థాన్ వేదికగా గడిచిన ఆదివారం జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిసి, చర్చలు విఫలం అంటే అమెరికా ఏకపక్షంగా ప్రకటన చేసిన తరువాత శాంతి ఆశలు దాదాపు అణగారిపోయాయి. ఈ నేపథ్యంలో మరో సారి చర్చలు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు ఈ సారైనా చర్ఛలు ఫలవంతంగా సాగాలని కోరుకుంటున్నాయి. దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించే దిశగా ఇరు దేశాలూ అంటే అమెరికా, ఇరాన్ లు అడుగులు వేస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిణామాల మధ్య, ఇరాన్‌తో నేరుగా లేదా పరోక్షంగా చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గెలుస్తామో లేదో తెలియని యుద్ధాన్ని కొనసాగించేకంటే.. ఏదో ఒకలా ఏదో మేరకు శాంతి కుదిరితే అదే పదివేలన్న భావనలో అమెరికా ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా సాగుతున్నది. శాంతి చర్చలకు ప్రతిష్ఠంభనగా మారిన 2015 నాటి అణు ఒప్పందం విషయంలో పట్టువిడుపుల ధోరణి అవలంబించేదుకు ఇరు దేశాలూ కూడా ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఈ ఒప్పందం నుండి వైదొలగిన తర్వాత, ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన అణు కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇక తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై సంయుక్తదాడులకు పాల్పడటంతో ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముగింటకు చేరిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్యా ఆదివారం ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఒక కీలక ముందడుగుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆ చర్చలు విఫలమై.. మళ్లీ దట్టంగా యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ.. అమెరికా, ఇరాక్ లు మరో మారు శాంతి చర్చలు నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేశాయన్న వార్తలు ప్రపంచ శాంతి కోరుకునే వ్యక్తలలో హర్షాతిరేకాలను నింపాయి. సమస్యల పరిష్కారానికి దౌత్యమే ఏకైక మార్గమని, అయితే అది తమ జాతీయ భద్రతా ప్రయోజనాలకు లోబడి ఉండాలని చెబుతున్న అమెరికా.. ఇరాన్ తో శాంతి చర్చల కోసం ఒకటి కాదు, పది మెట్టైనా దిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. గత శని, ఆదివారాల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన సుదీర్ఘ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా సోమవారం నుండి ఇరాన్ ఓడరేవులకు వచ్చే ఓడలపై పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా, ఇరాన్ మధ్య గురువారం (ఏప్రిల్ 16) మరో సారి చర్చలు జరగనున్నాయి. ఒకవైపు సైనిక చర్యలు, మరోవైపు దౌత్య చర్చలు సాగించడం ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నది అమెరికా వ్యూహంగా చెబుతున్నారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాదే ఈ సారి కూడా ఈ కీలక చర్చలకు వేదిక కానుంది. గతంలో జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి స్పష్టమైన ఒప్పందం లేకుండా ముగియడం, ఆ వెంటనే అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ప్రకటించడం వంటి ఉద్రిక్త పరిణామాల మధ్య ఇప్పుడు జరగనున్న రెండో విడత చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక గురువారం (ఏప్రిల్ 15) జరగబోయే చర్చల్లో ఏ స్థాయి ప్రతినిధులు పాల్గొంటారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా అమెరికా, ఇరాన్ పంతాలను వీడి శాంతి దిశగా అడుగులు వేయాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.
http://www.teluguone.com/news/content/us-and-iran-peace-talks-once-again-36-217324.html





