జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు...
Publish Date:Mar 19, 2013
Advertisement
ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల రెండింటి పరిస్థితి జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లుంది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడినందుకు సంతోషపడాలో లేక తమ ప్రభుత్వం మైనార్టీలో పడినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. తనకు వ్యతిరేఖంగా ఓటువేసిన 9 మంది జగన్ అనుచరులపై వేటు తప్పదని బింకాలు పలికిన కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ కూడా మళ్ళీ తమ మాటలను మింగక తప్పేట్లు లేదు. అంతేకాక మళ్ళీ వారి దయా దాక్షిణ్యాలపైనే తమ ప్రభుత్వం మనుగడ సాగించవలసి రావడం అవమానకరం అయినా తప్పట్లేదు. అక్కడ కేంద్రంలో తమిళ తంబి కరుణానిధి అకస్మాత్తుగా యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి ప్రత్యామ్నాయ పార్టీల వైపు పరుగులు పెట్టిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానంలో ఓటేసిన 9 మంది జగన్ అనుచరులను పార్టీలోంచి పీకేయాల వద్దా? లేక వారిపై అనర్హత వేటువేయకుండా మరో ఆరు నెలలు తాత్సారం చేస్తూ వారి సాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకు రావాలా? వంటి అనేక ధర్మసందేహాల చిట్టాతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డిల్లీ బయలుదేరెందుకు తయారవుతుంటే, అక్కడ డిల్లీలో యుపీయే ప్రభుత్వం కరుణానిధి తుమ్మితే ఊడిపోయే ముక్కులా పరిస్థితులు ఇంతకంటే అద్వానంగా తయారయ్యాయి. ఇంతవరకు యస్పీ, బీయస్పీలను పులుసులో కరివేపాకులా వాడుకొంటున్న యుపీయే ప్రభుత్వం, ఇప్పుడు తన మనుగడకోసం వాటిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో పడింది. ఇంతవరకు బయట నుండి మద్దతు ఇస్తున్న ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐను అస్త్రంగా చేసుకొని తమను బెదిరించి మద్దతు పొందుతోందని బహిరంగంగానే చెపుతున్నాయి. తమిళ తంబి సగం కాచి వదిలేసిన ‘యుపీయే సాంబారులో’కి ఆ కరివేపాకు రెమ్మలు రెంటినీ కాంగ్రెస్ వేసుకోవాలంటే మళ్ళీ సీబీఐకి పని చెప్పక తప్పదేమో. ఒకవైపు కేంద్రం మరో వైపు రాష్ట్రం రెండూ కూడా మైనార్టీలోపడటం కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా ఇబ్బందే. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ప్రభుత్వానికి డోకాలేదు అంటూ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శించక తప్పట్లేదు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం చాల కష్టమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తనంతట తానూ పూర్తి మెజారిటీ సాదించలేదు కనుక ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాలపై ఆధార పడక తప్పట్లేదు. ఇటీవలే పార్టీ సారద్య బాద్యతలు చేప్పటిన యువనాయకుడు రాహుల్ గాంధీ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన గూటి నుండి బయటకి వచ్చిపార్టీని గట్టెకించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం యుపీయే ప్రభుత్వానికి కొత్త కాకపోయినప్పటికీ, ఆయనకు ఇంకా తగిన అనుభవం లేదు గనుక దూరంగా ఉంటున్నారో లేక వేరే కారణాలు ఏమయినా ఉన్నాయో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని తన సారద్యంలో ఎక్కడికో తీసుకు పోవాలనుకొనే ఆయన తన సామర్ద్యం నిరూపించుకోవాలంటే ఇదే తగిన సమయం.
http://www.teluguone.com/news/content/upa-39-21744.html





