ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు..!
Publish Date:Aug 4, 2026
Advertisement
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యల వ్యవహారంలో ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ సినీ నటి త్రిషలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కావేరీ జలాల పంపిణీకి సంబంధించి తంజావూరులో డీఎంకే నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ పాలనా తీరును విమర్శిస్తున్న సమయంలో, సభలోని కొందరు మద్దతుదారులు నటి త్రిష పేరును నినాదాలుగా చేశారు. ఆ సమయంలో ఉదయనిధి నవ్వుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సభలో చోటుచేసుకున్న ఈ పరిణామంపై అధికార టీవీకే (తమిళగ వెట్రి కళగం) వర్గాలు మరియు భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉదయనిధి మాట్లాడిన తీరు మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉందంటూ తంజావూరు పోలీసు స్టేషన్‌లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు వివిధ తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వార్త వ్యాపించడంతో ఉదయనిధి నివాసం వద్ద, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో డీఎంకే కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల చర్యను నిరసిస్తూ డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టాయి. తాజా అరెస్ట్ చర్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. తాను ఎలాంటి తప్పు మాట్లాడలేదని, ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. వెంటనే ఆయన తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు, వాదనలు విన్న అనంతరం ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో డీఎంకే వర్గాల్లో ఉత్సాహం నెలకొనగా, పోలీస్ స్టేషన్ వద్ద వాతావరణం శాంతించింది. అయితే కావేరీ జలాల వివాదంతో పాటు నాయకుల వ్యక్తిగత విమర్శల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ సమరం మున్ముందు తమిళనాడులో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. Udhayanidhi Stalin Bail, Madras High Court, Trisha Vijay Controversy, Tamil Nadu Politics, DMK Leader Arrest, CM Vijay, MK Stalin
http://www.teluguone.com/news/content/udhayanidhi-stalin-bail-36-227971.html





