నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిథి స్టాలిన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు.!
Publish Date:Aug 4, 2026
Advertisement
తమిళనాట రాజకీయ విమర్శలకు త్రిష మరో సారి కేంద్ర బిందువుగా మారారు. త్రిషపై డీఎంకే నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార టీవీకే, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. తంజావూరులో కావేరి జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉదయనిథి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు.. విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ.. త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్ నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యల వీడియోలు వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఉదయనిధి స్టాలిన్ ద్వంద్వార్థ వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ప్రజాజీవితం ఉన్న నాయకుడు మహిళల పట్ల ఇలాంటి చౌకబారు భాషను ఉపయోగించడం డీఎంకే దిగజారుతున్న రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు. అలాగే.. బీజేపీ కూడా ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ వివాదాన్ని టీవీకే అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఉదయనిధి స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు అఫీషియల్ గా లేఖ రాసింది. సొసైటీలో ఎంతో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ నటిని, మహిళను బహిరంగ వేదికపై అగౌరవపరిచినందుకు గాను ఆయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. సమాజానికి, బాధితురాలికి ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరింది. Udhayanidhi Stalin, Actress Trisha, DMK TVK controversy, Cauvery water protest, Tamil Nadu news, NCW complaint
http://www.teluguone.com/news/content/udhayanidhi-stalin-39-227937.html





