తప్పుడు కేసుతో రెండున్నరేళ్లు నరకయాతన.. కాదంబరి జెత్వాని
Publish Date:Jul 22, 2026
Advertisement
తనపై, తన కుటుంబ సభ్యులపై 2024లో నమోదైన కేసు పూర్తిగా తప్పుడు ఆరోపణలతో, కుట్రపూరితమైందని, నటి, మోడల్, డాక్టర్ అయిన వైద్యురాలు కాదంబరి జెత్వాని ఆరోపించారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనలో.. ఆ తప్పుడు కేసు కారణంగా రెండున్నరేళ్లు తాను, తన కుటుంబం తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొన్నామని తెలిపారు. చివరకు చట్టపరంగా తాము నిర్దోషులమని తేలిందని చెప్పారు. తాను అన్ని సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ సాధించిన గోల్డ్ మెడలిస్ట్ మెడికోనని చెప్పిన కాదంబరి జెత్వానీ.. అమెరికాలోని ప్రముఖ వైద్య విశ్వవిద్యాలయా లతో విద్యా సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తిగా ప్రతిభ ఆధారంగా ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించకుండా వైద్య విద్యను పూర్తి చేశానన్నారు. అటువంటి తనపై నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు, వృత్తి, వ్యక్తిగత జీవితం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తనపై ఎలాంటి బలమైన ఆధారాలు లేవని పేర్కొన్న కాదంబరి జెత్వానీ.. ఫిర్యాదుదారుడి నుంచి తన బ్యాంకు ఖాతాలోకి వచ్చిన సుమారు రూ.4.5 లక్షలు తాను చేసిన పనికి సంబంధించిన చెల్లింపులు, బహుమతులు మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే కాల్ రికార్డులు, సందేశాలు కేవలం మాట్లాడుకున్న విషయాన్ని మాత్రమే చూపుతాయనీ.. అవి నేరానికి ఆధారాలు కావని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుడి గత చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించానన్న ఆమె.. . ఆ తర్వాత అతను తన అనుమతి లేకుండా నగ్న ఫొటోలు పంపి వేధించాడని, అదే ఫొటోలను సీఐడీ తనపై అభ్యంతరకర చిత్రాలుగా చూపించడం బాధాకరమన్నారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా తప్పుగా చూపించారని, వాటిని కోర్టు ఇప్పటికే తిరస్కరించిందని పేర్కొన్నారు. 2025లో ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడితో పాటు ముగ్గురు సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఫిర్యాదుదారుడితో తనకు ఉన్న పరిచయం, ఆర్థిక లావాదేవీలు దాదాపు పదేళ్ల క్రితమే ముగిశాయని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లోని మిగిలిన ఆరోపణలు కూడా పూర్తిగా కల్పిత కథనాలేనన్నారు. కొన్ని మీడియా సంస్థలు 4.5 లక్షల లావాదేవీని 1.32 కోట్లుగా చూపించి, బ్లాక్‌మెయిల్, రాకెట్, దోపిడీ, తప్పుడు కేసు వంటి పదాలతో తనపై అసత్య ప్రచారం చేశాయని విమర్శించారు. తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తనకు రాజకీయ అండ, ఆర్థిక బలం లేకపోవడం వల్లే సులభంగా లక్ష్యంగా మారానని ఆవేదన వ్యక్తం చేసిన కదంబరి జెత్వాని, తనపై ఉన్న తప్పుడు ఆరోపణలను కొట్టివేసి, తనను నిర్దోషిగా ప్రకటించడంలో ఇక జాప్యం చేయవద్దని దర్యాప్తు సంస్థలను కోరారు. తన కన్నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయనీ, ఈ పోరాటం తన కోసం మాత్రమే కాదనీ, నాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి అమ్మాయి కోసమనీ జెత్వానీ పేర్కొన్నారు. Two and a half years orture, False Case, Kadambari Jatwani
http://www.teluguone.com/news/content/two-and-a-half-years-orture-36-226734.html





