విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. సర్వత్రా ఆసక్తి.!
Publish Date:Aug 4, 2026
Advertisement
తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం బుధవారం తన తొలి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రి మేరీ విల్సన్ బుధవారం ( ఆగస్టు5) సభలో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సమర్పిస్తున్న తొలి బడ్జెట్ కావడంతో.. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కొత్త పథకాలు, పాలనా సంస్కరణలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం భారీ నిధులు వెచ్చించాల్సిన నూతన సంక్షేమ పథకాల ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పటివరకు అధికారికంగా అమలు చేస్తున్న తైమామన్ తంగ మోదిరం' పథకం తప్ప, ఇతర పెద్ద పథకాల ప్రకటనలేవీ వెలువడలేదు. ఈ తొలి బడ్జెట్‌లో సామాన్య ప్రజలను ఆకట్టుకునేలా కొన్ని కొత్త పథకాలతో పాటు, సేవా రంగాన్ని బలోపేతం చేసే కీలక పాలనా సంస్కరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం. ప్రజలపై అదనపు పన్నుల భారం వేయకుండా ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అనవసర వ్యయాలను తగ్గించుకుంటూ, ఆదాయ సేకరణను మెరుగుపరచడం ద్వారా ఆర్థిక లోటును పూడ్చాలని భావిస్తోంది. ప్రజా సేవలను మరింత వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం ద్వారా పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో శాసనసభ నిర్వహణ, బడ్జెట్‌పై చర్చలకు కేటాయించే వ్యవధి, సంబంధిత షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. మొత్తానికి, టీవీకే ప్రభుత్వం తన తొలి వార్షిక బడ్జెట్ ద్వారా ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నది తమిళనాటే కాకుండా, దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. TVK Budget 2026, Tamil Nadu First Budget, Mary Wilson TVK, Thaimaman Thanga Mothiram Scheme, Tamil Nadu
http://www.teluguone.com/news/content/tvk-budget-2026-25-228038.html




