బీహారీ ఆఫీసర్లకు కోపమొచ్చింది.. కానీ...
Publish Date:Mar 3, 2022
Advertisement
అంటే, అన్నారంటారు. కానీ, చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లుగా, ప్రకటనలు చేస్తే, ఎవరైనా ఏమి సార్లు మీరు నిజంగా ఐఎఎస్ చేశారా? అని అడగరా, అడుగుతారు. అదే అడుగుతున్నారు సామాన్య జనం. విషయం ఏమంటే, తెలంగాణలో ఐఎఎస్’ ల పోస్టింగుల గురించి, కొందరు ఐఎఎస్’ల ప్రవర్తన గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, 1200 మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీహారు బాబులు ఏలుతున్నారనే, ఆవేదన తెలంగాణ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులే కాదు సామాన్యులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇదలా ఉంటే పుండు మీద కారం చల్లినట్లు, బీహరుకే చెందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్’కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తు పీటవేసి, తెలంగాణ ఉద్యోగులు,అధికారులు,ప్రజల మనోభావాలను దెబ్బ తీశారనే చర్చకు ఆస్కారం కల్పించారు. ఈ నేపద్యంలో, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరి కొందరు ముఖ్యనేతలు, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అధికార్లను అవమాన పరుస్తూ, సీఎస్, డీజీపీ, సహా కీలక శాఖల బాధ్యతలను బీహారు బాబులకే ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి బీహారుకు చెందిన ఐఏఎస్ అధికారులను రక్షణ వలయంగా చేసుకుని, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీహారీ పాలన సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి బీహారు బాబులకు ప్రధాన్యత ఇవ్వడంతో తెలంగాణ ప్రాంత అధికారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్రమాలకు సహకరించే ఐఏఎస్‌లకు కీలక పోస్టులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి తమదైన స్టైల్లో తప్పు పట్టారు. అయితే ఉన్నమాటంటే ఉలుకెక్కువ అన్నట్లుగా, ఊరు పేరు లేని, తెలంగాణ స్టేట్ ఐఎఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్, రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా, తెలంగాణలో సాగుతున్న బీహారు బాబుల ఆధిపత్యానికి సంబంధించి రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే చిత్రం ఏమంటే, అసలు అ ప్రకటన చేసింది ఎవరో, వారి ఊరేమిటో, పేరేమిటో కూడా చెప్పుకోలేదు. ఆ ప్రకటన ‘దారిన పోయే దానయ్య’ విడుదల చేసిన ప్రకటనలాగా పైన ఆర్గనైజేషన్ పేరు ఉందే తప్ప కింద ఎవరి సంతకం లేదు. సంతకం కాదు, అసలు పేరే లేదు. బీహారు ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులకు అఖిల భారత సర్వీస్ అధికారుల నియామక విధివిధానాలు, స్వభావం గురించి అవగాహన లేదని అవహేళన చేసిన, ఐఎఎస్ అధికారులకు, తాము విడుదల చేసిన ప్రకటన తమదే అని ద్రువీకరించే సంతకం చేయాలనే కనీస అవగాహన లేక పోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. అంతే కాదు, ఇదీ కూడా బీహారీ బాబుల పనే కావచ్చని, అందుకే ఎక్కడా, ఎవరి పేరు లేకుండా, ప్రకటన విడుదల చేశారని తెలాంగాణ గడ్డన పుట్టిన అధికారాలు అంటున్నారు. ఏమో తెలంగాణ నయా బీహార్’ గా మారుతున్న క్రమంలో ఏమైనా జరగ వచ్చని అధికారులే అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ts-ias-officers-institute-condemns-political-comments-against-bihar-babus-39-132505.html





