నిధుల కోసం హస్తినకు తెలంగాణ ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ
Publish Date:May 19, 2022
Advertisement
తెలంగాణ ప్రభుత్వ ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణారావు కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. మార్కెట్ రుణాలు తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వని నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి రుణాల కోసం చివరి యత్నం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కే. రామకృష్ణారావును ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రామకృష్ణారావు గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అవుతారు. అప్పుల కోసం ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతారు. అయితే రాష్ట్రంపై కేంద్రం కనికరిస్తుందా? అప్పు పుడుతుందా? ఆర్థిక కష్టాలు గట్టెక్కుతాయా? అనేది వేచి చూడాల్సిందే. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, పథకాలకు ప్రభుత్వం నిధుల కటకట ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేయడంతో ఏప్రిల్‌లో అందాల్సిన రూ.3000 కోట్ల రుణం అందకుండా పోయింది. కనీసం మే నెల అప్పులైనా అందుతాయనుకుంటే.. నిరాశే ఎదురైంది. ఆర్‌బీఐ కేలండర్ ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం రూ.13000 కోట్లను అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు, ప్రభుత్వ గ్యారంటీ అప్పులపై వివరాలు అడిగింది. కేంద్రం అడిగిన వివరాల విషయంలో సంతృప్తిపర్చిన రాష్ట్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ వస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన వివరణలపై కేంద్రం సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అప్పుల ఇండెంట్లను రీ-షెడ్యూల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది.
http://www.teluguone.com/news/content/ts-finance-special-secratary-to-delhi-on-kcr-order-25-136145.html





