అధికార దర్జా.. టీఆర్ఎస్ భూ కబ్జా
Publish Date:May 12, 2022
Advertisement
పార్టీ కార్యాలయం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నడి బొడ్డున ఏకంగా ఎకరం భూమి కేటాయించింది. మార్కెట్ దార ప్రకారం ఈ భూమి విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా. ఒక వైపు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భూములు అందుబాటులో లేవని చెబుతున్న ప్రభుత్వం సొంత పార్టీ ఆఫీస్ కోసం మాత్రం ప్రైమ్ ఏరియాలో దాదాపు ఎకరం భూమిని కేటాయించడం అధికార కబ్బా తప్ప మరొకటి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం ప్రభుత్వం నగరంలో అత్యంత లగ్జూరియస్ ఏరియాలలో ఒకటైన బంజారా హిల్స్ లో ఏకంగా 4539 గజాల స్థలాన్ని కేటాయింది. ఈ కేటాయింపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. దీనికి అధికారిక కబ్జాగా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఇలా భూ కబ్జాలకు వినియోగిస్తున్నదని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. దొడ్డిదారి జీవోలతో అత్యంత విలువైన భూమిని పార్టీ కార్యాలయం కోసం కట్టబెట్టడం భూ దొపిడీ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు లేవన్న నిర్ధారణకు రావడం వల్లే తెరాస అధినేత పార్టీకి ఇలా అడ్డగోలుగా విలువైన భూమిని ధారాదత్తం చేశారని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెరాస సర్కార్ అడ్డగోలుగా భూ పందేరానికి తెరలేపిందనీ, పార్టీ వ్యక్తులకు, అస్మదీయులకు ప్రభుత్వ భూమినీ, అసెన్డ్ భూములను కట్టబెడుతోందని విమర్శలు వినవస్తున్నాయి. వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి రెడ్ ఫోర్డ్ పేరిట కట్టబెట్టిందనీ, రియల్ వ్యాపారం కోసం అసైన్డ్ భూములనూ వదలడంలేదని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నది. మరో వైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం విలువైన భూమిని కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ అక్రమ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నది.
http://www.teluguone.com/news/content/trs-official-land-grab-in-name-of-party-office-39-135773.html





