టిఆర్ఎస్, టిజెఎసిల మధ్య రగులుతున్న కుంపటి
Publish Date:Jan 22, 2012
Advertisement
హైదరాబాద్: సంక్రాంతి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం మాటేమోగానీ, టిఆర్ఎస్, టిజెఎసిల మధ్య మాత్రం విభేదాలు తీవ్రతరం అయ్యాయి. ఇంతకాలంగా తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల జెఎసిలో (టిజెఎసి) పెద్దన్న పాత్ర పోషించిన టిఆర్ఎస్, ప్రధానంగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ వైఖరి పట్ల టిజెఎసి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా ఉద్యమకార్యాచరణను రూపొందించాలని భావించిన టిజెఎసి వ్యూహంపై కెసిఆర్ నీళ్లు చల్లడం పట్ల జెఎసిలోని భాగస్వామ్య రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా కాకుండా, తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా టిఆర్ఎస్ లాక్కెళుతోందని టిజెఎసిలోని ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ అంశాన్ని తేల్చేవిధంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సిందిపోయి, 2014 ఎన్నికల్లో లబ్ధిపొందేలా ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారని టిజెఎసిలోని భాగస్వామ్యపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తుతానికి నీరుగార్చి, ఎన్నికలనాటికి ఉద్ధృతం చేసే దిశగానే టిఆర్ఎస్ యోచిస్తోందని టిజెఎసిలో భాగస్వామ్య పక్షాలైన బిజెపి, న్యూడెమోక్రసీ నేతలు తమ అంతర్గత చర్చల్లో బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఈ పార్టీలు తన అసంతృప్తిని బాహాటంగా వెల్లడించకపోయినా తెలంగాణ ఉద్యమానికి టిఆర్ఎస్ కాకుండా తమ పార్టీ నాయకత్వం వహించాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టిజెఎసిలో టిఆర్ఎస్ అనుసరిస్తున్న సాచివేత ధోరణిని బిజెపి రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ కారణంగా తెలంగాణ ఉద్యమంలో బిజెపి ఒంటిరి ప్రయాణానికి సిద్ధమైందని ఆ పార్టీ నుంచి టిజెఎసిలో కీలక భూమిక పోషిస్తున్న నాయకుడొకరు చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేపట్టిన తెలంగాణ యాత్రకు సంఘీభావం ఎందుకు ప్రకటించలేదని బిజెపిలో చర్చ జరిగిందని తెలిసింది.
ఇలా ఉండగా టిజెఎసిలో ప్రధాన భూమిక పోషిస్తున్న న్యూడెమోక్రసీ పార్టీ కూడా టిఆర్ఎస్ వైఖరి పట్ల విముఖతతో ఉందని తెలిసింది. తమ పార్టీ అధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కెసిఆర్ హాజరుకాకపోవడం పట్ల న్యూడెమాక్రసీ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలిసింది. తెలంగాణ ఉద్యమం ముందుకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక కుంటిసాకుతో టిజెఎసి ముందరి కాళ్లకు టిఆర్ఎస్ బంధం వేస్తోందనే అభిప్రాయం ప్రజాసంఘాల్లోనూ వ్యక్తం అవుతుంది.
తెలంగాణ ఉద్యమాన్ని టిఆర్ఎస్ ఏకనాయకత్వంలో పెట్టడం వల్లనే ఇలా జరిగిందని, ఇక నుంచి రాష్ట్ర సాధన కోసం కలిసివచ్చే పార్టీలన్నింటిని కలుపుకుపోయే దిశగా ఉద్యోగ సంఘాల నేతలు యోచిస్తోన్నట్టు తెలిసింది. టిజెఎసి విస్తృతస్థాయి సమావేశంలో టిఆర్ఎస్ వైఖరి నచ్చకనే తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తెలంగాణకు బద్ధవ్యతిరేకి అయిన రేణుక చౌదరి ఇంటికి వెళ్లి గులాంనబీ ఆజాద్‌ను కలిసి ఉంటారని టిజెఎసి నేత ఒకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై పలు సందర్భాల్లో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల కారణంగా ఉద్యమ నేతలు ఎవరూ కూడా రేణుకా చౌదరి ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడరని, టిఆర్ఎస్పై ఆగ్రహంతోనే వారు వెళ్లి ఉంటారని టిజెఎసి నేత ఒకరు విశ్లేషించారు. ఇంతకాలంగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ టిజెఎసిలో పెద్దన్న పాత్ర పోషిస్తోన్న టిఆర్ఎస్ వైఖరితో బేజారైన భాగస్వామ్య పార్టీలు, ప్రజాసంఘాలు తమ దారి తాము చూసుకోవడం పట్ల తెలంగాణవాదులు ఆందోళనకు గురవుతున్నారు.
http://www.teluguone.com/news/content/trs-24-11138.html





