పింక్ డైమండ్ కేసు.. రమణ దీక్షితులు, విజయసాయికి చిక్కులు తప్పవా?
Publish Date:Jul 24, 2026
Advertisement
పింక్ డైమండ్ కేసు టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ మాజీ నేత విజయసాయి మెడకు చుట్టుకుంటోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది. విషయానికి వస్తే.. ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పోయిందంటూ.. టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు, అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ను బదనాం చేయడమే లక్ష్యంగా వారిద్దరు మిన్నూమన్నూ ఏకమయ్యేలా ప్రచారం చేశారు. పింక్ డైమండ్ పేరుతొ సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వరుడిని కూడా రాజకీయ వివాదాల్లోకి లాగారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై నిందలు వేయడంతోపాటు .. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడంతో .. టీటీడీ రెండుకోట్ల రూపాయల ఫీజు కట్టి మరీ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై చెరో వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఈ కేసును నీరుగార్చేందుకు చేయని ప్రయత్నం లేదు. అసలు శ్రీవారి ఆభరణాల్లో పింక్ డైమండ్ అనేదే లేదని, అది ఒక గులాబీ రంగు రాయి మాత్రమేనని జగన్ ప్రభుత్వమే అసెంబ్లీలో, ఉన్నత న్యాయస్థానాల్లో స్వయంగా అంగీకరించింది. తద్వారా తాము చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని చెప్పకనే చెప్పినట్లైంది. అంతే కాకుండా.. టీటీడీ చేత ఆ కేసును వెనక్కి తీసుకుంటామంటూ.. కోర్టులో ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేయించింది. అయితే.. కేసును విత్ డ్రా చేసుకోడానికి వీల్లేదనీ.. కేసులో తమను కూడా పార్టీలుగా చేర్చాలంటూ, తెలంగాణ హిందూ జనశక్తితోపాటు, మరో న్యాయవాది పిటిషన్ వేశారు. వారికి టీటీడీతోపాటు ఈ కేసులో పార్టీలుగా ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈకేసులో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు చిక్కులు తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇప్పుడు ఈ కేసు విచారణ తుది దశకకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి, వెంకయ్య చౌదరి సాక్ష్యం, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది. ఏ ఆధారాలు లేకుండా అత్యున్నత ధార్మిక సంస్థపై, అప్పటి సీఎంపై దుష్ప్రచారం చేసి భక్తుల నమ్మకాలను అపహాస్యం చేసినందుకు గానూ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు ఆ ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పని పరిస్థితి ఎదురైందనీ, టీటీడీ పరువునష్టం దావాలో రమణదీక్షితులు, విజయసాయిలు చిక్కులు ఎదుర్కొనక తప్పదనీ, నాడు నిరాధార ఆరోపణలు చేసినందుకు శిక్ష అనుభవించడమో, భారీ పరిహారం చెల్లించాల్సి రావడమో తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. Pink Diamond Controversy, Ramana Deekshithulu, Vijayasai Reddy, TTD Missing Jewels, Tirumala Venkateswara Temple
http://www.teluguone.com/news/content/troubles-inevitable-for-ramana-dikshitulu-and-vijayasai-36-226947.html





