తెలంగాణలో త్రిముఖ పోరు పక్కా.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో గెలుపు ధీమా!
Publish Date:May 14, 2022
Advertisement
వచ్చే ఏడాది జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరు పక్కా అని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో విజయంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ధీమా వ్యక్తమౌతున్నది. చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి ముచ్చటగా మూడోసారీ అధికార పీఠానని దక్కిస్తాయని టీఆర్ఎస్ లో ధీమా వ్యక్తం అవుతుంటే.. తెలంగాణ మౌలిక ఆశయాలను తుంగలో తొక్కి అన్న వర్గాలకూ అన్యాయం చేసిన టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్న తెలంగాణ ప్రజ ఎన్నో త్యాగాలకు సిద్ధమై తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ పట్ల అభిమానం చాటుకునేందుకు కాంగ్రెస్ కే పట్టం కడతారని కాంగ్రెస్ విశ్వసిస్తున్నది. ఇక మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లలో దేశం సాధించిన విజయాలు, అభివృద్ధే తెలంగాణలో ప్రజలు తమకే పట్టం గట్టేలా చేస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో వచ్చే ఎన్నికలలో విజయం పట్ల నమ్మకమూ, అప నమ్మకమూ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో రెండవ శ్రేణి నాయకత్వం కరవైన విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మొత్తం పార్టీ అంతా వన్ మేన్ షో లేదా వన్ పార్టీ షోగా నడుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే పార్టీలో మొత్తం షో.. ఆయన తరువాత స్థానాలలో వరుసగా కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితలు ఉంటారు. పార్టీకి ఇదే బలం, బలహీనతా అయ్యింది. ఈ నలుగురినీ మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత ఉన్న నేతలు కానీ, ప్రజలను ప్రభావితం చేసేలా ప్రసంగించగలిగే నాయకులు కానీ ఉన్నట్లు కనిపించరు. ఇక మహిళా నేతలలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు అడపాదడపా ప్రెస్ మీట్లతో మెరిసినా ప్రజలలో పెద్దగా పట్టున్న నేతలు కారు. ఇక ఎమ్మెల్యేలు, మిగిలిన మంత్రుల పాత్ర పార్టీలో పార్టీ వ్యవహారాలలో నామమాత్రమే. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇంకా ప్రజలలో పూర్తిగా చెరిగిపోని సెంటి మెంట్ పైనే తెరాస విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అలాగే తెరాస శ్రేణుల్లో కేసీఆర్ ఏం చేసైనా పార్టీని గెలుపు బాట పట్టిస్తారన్న విశ్వాసం ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీలో కార్యకర్తల కంటే నాయకుల సంఖ్యే అధికం. అదే ఆ పార్టీకి బలహీనతగా మారింది. నేతలలో ఆధిపత్య పోరు కారణంగానే క్షేత్ర స్థాయిలో పార్టీకి బలమైన క్యాడర్, నిర్మాణం ఉన్నా వరుస పరాజయాలను ఎదుర్కొంటోది. ఇటీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నేతలలో అమస్మతి పెరిగింది. కానీ క్యాడర్ లో ఉత్సాహం నిండింది. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆదరణ పెరిగేలా చేసింది. రాహుల్ గాంధీ వరంగల్ సభలో నేతల మధ్య గ్యాప్ విషయంలో స్పష్టమైన హెచ్చరిక లాంటి సంకేతాలు వెళ్లడంతో ప్రస్తుతానికి ఆ పార్టీలో ఐక్యత కనిపిస్తున్నది. ఒకరిద్దరు బహిరంగంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నా పెద్దగా పట్టించుకోనవసరం లేదన్న ధీమా పార్టీలో కనిపిస్తున్నది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ పార్టీలో ప్రజలను ప్రభావితం చేయగలిగేలా ప్రసంగించే నేతలు మిగిలిన పార్టీలలో కన్నా ఎక్కువగా ఉన్నారు. అలాగే ఈటల, రఘునందనరావుల చేరికతో ఆ పార్టీకి ఒకింత బలం పెరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. రెండేండ్ల క్రితం కేవలం రాష్ట్ర బీజేపీలో మీడియా సమావేశాలు పెట్టి పార్టీ విధానాలను వివరించగలిగే స్థాయి ఉన్న నేతలు ఒకరిద్దరు మాత్రమే కనిపించేవారు. అయితే ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. అధికార పార్టీ కంటే, విపక్ష కాంగ్రెస్ కంటే.. బీజేపీలో ప్రజాకర్షక ప్రసంగాలు చేసే నేతల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటి వరకూ పట్టణాలకే పరిమితం అన్న ముద్ర పడిన బీజేపీ గ్రామ స్థాయిలో కూడా చెప్పుకోదగినట్లుగా బలోపేతం అయ్యింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నకలలో విజయాలే దీనికి నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. దీనికి తోడు జాతీయ నాయకులు జెపి నడ్డా, అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తెరాస పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ బలహీనత, మోడీ ఛరిష్మాతో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టగలమన్న ధీమా కమలం పార్టీలో వ్యక్తమౌతున్నది. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/triangular-fight-sure-ti-telangana-trs-congress-bjp-confidence-on-win-39-135858.html





