స్వాతంత్య్ర దినోత్సవం.. గోల్కొండ వైపు ట్రాఫిక్ ఆంక్షలు..!
Publish Date:Aug 14, 2026
Advertisement
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రామదేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే ప్రధాన రహదారిలో సాధారణ వాహనాలను అనుమతించరు. కార్ పాస్‌లు ఉన్న ఆహ్వానితులను మాత్రమే నిర్దేశిత మార్గాల్లో కోటకు అనుమతిస్తారు. వివిధ కేటగిరీల పాస్‌లకు అనుగుణంగా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు. గోల్డ్, క్రీమ్, బ్లూ పాస్‌లకు ఫతే దర్వాజా రోడ్డు, గోల్కొండ బస్‌స్టాప్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. గ్రీన్ పాస్‌లకు ఒవైసీ గ్రౌండ్, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్లలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రెడ్ పాస్‌లకు గోల్కొండ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో వాహనాలను నిలిపే అవకాశం కల్పించారు. సాధారణ ప్రజల కోసం తవక్కల్ డైవర్షన్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల, సెవెన్ టాంబ్స్, డెక్కన్ పార్క్, గోల్కొండ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్లను పార్కింగ్ ప్రాంతాలుగా గుర్తించారు. వేడుకలు ముగిసే సమయంలో కూడా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక మళ్లింపులు చేపట్టనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెవెన్ టాంబ్స్ నుంచి గోల్కొండ వైపు వచ్చే సాధారణ వాహనాలను గోల్ఫ్ క్లబ్, జామాలి దర్వాజా వైపు మళ్లించనున్నారు. లంగర్ హౌస్ వైపు నుంచి వచ్చే వాహనాలను బడా బజార్ జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ ఐలాండ్ వైపు మళ్లిస్తారు. ఆహ్వానితులు తమ కార్ పాస్‌లను వాహనం విండ్‌స్క్రీన్ ఎడమవైపు స్పష్టంగా కనిపించేలా ఉంచాలని పోలీసులు సూచించారు. గోల్కొండకు వెళ్లే ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపివేయవద్దని, ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. ట్రాఫిక్ పరిస్థితులపై తాజా సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచించారు. అత్యవసర ట్రాఫిక్ సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ. జోయల్ డేవిస్ తెలిపారు. Traffic restrictions towards Golconda, Independence Day, CM Revanth reddy, Commissioner D. Joel Davis, GHMC, Ramadevguda
http://www.teluguone.com/news/content/traffic-restrictions-towards-golconda-36-228952.html





