ఇంకా జీతాల్లేవ్.. వైసీపీ ఎమ్మెల్యేల ధర్నా.. రేవంత్ ఫైర్.. టాప్ న్యూస్@1PM
Publish Date:Jan 10, 2022
Advertisement
పదో తారీఖొచ్చినా ఆంధ్రప్రదేశ్ లో కొందరు ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పదవీవిరమణ చేసినవారికి పింఛన్లు అందలేదు. దాదాపు 30 శాతానికిపైగా ఉద్యోగులకు, సగం మంది పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం. దీనిపై పింఛనుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటగంటకూ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఉసూరుమంటున్నారు.
--------
వేలకోట్ల ధాన్యం డబ్బులు రాక పండుగ వేళ అన్నదాతలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. నిబంధనల పేరుతో కొనుగోలులో దోపిడికి పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నించిన రైతులపై దాడులు చేసి, తప్పుడు కేసులతో ప్రభుత్వం జైల్లో పెడుతోందని విమర్శించారు. లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు మాయం అవ్వడానికి.. మీ ప్రభుత్వ అసమర్థత కారణం కాదా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
-------
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.ఆత్మకూరులా బీజేపీ నేతలు, పోలీసులను చంపడానికి ప్రయత్నించిన క్రిమినల్స్‌తో కూర్చుని నేరుగా పోలీసుల్ని బెదిరిస్తారా? అని మండిపడ్డారు. ఈ కుట్ర వెనక వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుందని విష్ణువర్ధన్ పేర్కొన్నారు.
--------
కమలాపురంలో వైసీపీ ఎమ్మెల్యేలు రైల్ రోకో నిర్వహించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే గేట్ వద్ద రైల్‌రోకో నిర్వహించారు. కడప స్టేషన్లల నిలిపి వేసిన కొన్ని రైళ్ళతో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళను కమలాపురం, కొండాపురం, ముద్దనూరు, నందలూరు స్టేషన్లలో ఆపాలని డిమాండ్ చేశారు. గతంలో ఆయా స్టేషన్లలో ఆపేవారని, కోవిడ్ తరువాత రైళ్లు ఆపడం లేదని రైల్ రోకో నిర్వహించారు
--------
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని 21 గ్రామ సచివాలయం సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఎంపీడీవోకు, మండల తహశీలదారుకు వినతి పత్రం అందజేశారు
---------
పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌనదీక్షకు దిగారు. ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు బండి సంజయ్ నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌనదీక్షలు చేశారు.
--------
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్టును ఖండించిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా ఖండించారు. 317 జీవో కారణంగా మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న బీంగల్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కారును పోలీసులు వెంబడించి కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
------
తెలంగాణలో 317 జీవో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రాణాలు తీస్తోంది. ఒక జిల్లాలో పుట్టి, పెరిగి అక్కడే ఉద్యోగం చేస్తున్నవారిని మరో జిల్లాకు బదిలీ చేస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను జీర్ణించుకోలేక, బలవంతపు బదిలీలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆదివారం ఒక్క రోజే ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడగా, మరో ఉపధ్యాయురాలి గుండె ఆగింది.
-------
దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 7,23,619 మంది చికిత్స తీసుకుంటున్నారు.ఇక డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి చేరుకుంది.
-------
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో జరిగిన ధరం సంసద్ హిందూ సమావేశంలో ద్వేషపూరిత ప్రసంగం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ధరం సంసద్ సమావేశంలో ముస్లిం వ్యతిరేక ప్రకటనలు చేసిన విషయంపై టీఎంసీ నాయకుడు ఫిర్యాదు చేశారు. ధర్మసంసద్ హరిద్వార్ ద్వేషపూరిత సమావేశం వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు షేర్ చేశారు.
----
http://www.teluguone.com/news/content/top-news-39-129953.html





