ఢిల్లీలో చర్చలేంటో.. బాబు లేఖాస్త్రం.. జైలుకు సంజయ్.. లాక్ డౌన్ సూన్.. టాప్ న్యూస్@7PM
Publish Date:Jan 3, 2022
Advertisement
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం జగన్ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రధాని ఎదుట ప్రస్తావించారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు.
-------
దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసం లాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సావాంగ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.‘‘ దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలో భాగంగానే చేశారు. ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని చంద్రబాబు అన్నారు.
--------
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటరిచ్చారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉండే మీవంటి వారితో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో ఏపీ బీజేపీ లేదని బదులిచ్చారు. నిత్యం ల్యాండ్, శాండ్, వైన్ ద్వారా పేద ప్రజల కష్టాన్ని పీక్కుతినే రాబందుల వంటి మీరా మాకు హితబోధ చేసేది? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. విశాఖ భూములపై కన్నేసి మూడు రాజధానులంటూ కుట్రలకు తెరదీసిన మీ నీతులు మాకు అవసరంలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
------
దేవినేని నెహ్రూ కుటుంబంపై ఎంపీ కేశినేని నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యారాజకీయాలు ప్రోత్సహించలేదని తెలిపారు. వంగవీటి రాధా, రంగా అనుచరులు స్వార్థ ప్రయోజనాల కోసం.. హత్యారాజకీయాలు చేయడంతో రంగా చనిపోయారని చెప్పారు. టీడీపీ,పట్టాభి ఇంటిపై ఎవరైతే దాడి చేశారో.. వారే రాధా ఆఫీసు దగ్గర రెక్కీ నిర్వహించారని కేశినేని నాని తెలిపారు.
-----
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు... పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు.
-------
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలు... సీఎం జగన్ తరహాలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు తప్పు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారని, ఇప్పుడు రెట్టింపు అప్పులు చేసి...సిగ్గు లేకుండా సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు. అప్పులు ఇచ్చే వాళ్లు రాష్ట్ర ప్రజలు, ఆర్ధిక వనరులు చూసి ఇస్తారని, జగన్‌ను చూసి ఎవ్వరూ అప్పు ఇవ్వరని అన్నారు.
-----
బీజేపీ నేత బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్‌పై కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి
---
బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన తీరు దారుణమని జేపీ నడ్డా అన్నారు. తలుపులు పగులగొట్టి భౌతిక దాడి చేశారని మండిపడ్డారు. సొంత కార్యాలయంలో దీక్ష చేస్తున్నా సాకులతో అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఉపాధ్యాయుల తరపున బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.
------
రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. కోవిడ్ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి తెలిపారు. డిసెంబర్ 30-31 తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన శాంపిల్స్ లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆయన చెప్పారు.ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు 6.5 శాతం పెరిగింది.
------
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. రాహుల్ పూర్వీకులు తాము యాక్సిడెంటల్ హిందువులమని చెప్పుకునేవారని యోగి గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాహుల్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ తనను తాను హిందువునని ఎప్పటికీ చెప్పుకోలేరని యోగి సెటైర్ వేశారు
http://www.teluguone.com/news/content/top-news-39-129562.html





