అల్లు వారి దూకుడు.. షేక్ అవుతున్న టాలీవుడ్!
Publish Date:Dec 22, 2024
Advertisement
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చినికిచినికి గాలివానలా మారి పెనుదుమారాన్ని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతోపాటు టాలీవుడ్‌నూ షేక్ చేస్తుంది. ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ గా ఈ వ్యవహారం మారింది. పనిలో పనిగా అర్జున్ లీగల్ టీం పోలీసులను సైతం రెచ్చగొట్టడంతో ఇంకాస్త ముదిరింది. తొక్కిసలాట ఘటనలో ప్రధాన ముద్దాయిగా అల్లు అర్జున్ ను ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ప్రొజెక్ట్ చేస్తుండగా.. తన తప్పేమీ లేదంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ వివాదం పెను దుమారంగా మారడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ వ్యవహారశైలి అన్న చర్చ మొదలైంది. థియేటర్ వద్ద ఘటన జరిగిన సమయంలో అర్జున్ వ్యవహార శైలి, కోర్టులో బెయిల్ కోసం వాదనలు జరిగే సమయంలో పోలీసులను కించపర్చేలా ఆయన లీగల్ టీం చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని పెంచేశాయి. దీనికితోడు.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై హడావుడిగా మీడియా సమావేశం పెట్టి అల్లు కుటుంబం ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందన్న వాదన ఉంది. భారీగా టికెట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే.. మాపైనే విమర్శలు చేస్తారా అంటూ ప్రభుత్వ పెద్దలు కన్నెర్రజేశారు. ఫలితంగా అల్లు వారి దూకుడు టాలీవుడ్ కు పెనుశాపంగా మారిందని ఇండస్ట్రీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సంధర్బంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ పై బయటకు రావడం 24గంటల్లో జరిగిపోయాయి. దీంతో, ఈ విషయం సర్దుమణిగిందని అందరూ భావించారు. కానీ, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోపాటు.. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. పనిలో పనిగా పోలీసులపైనా సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ విమర్శలు చేశారు. దీంతో తప్పంతా సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులది అన్నట్లుగా వ్యవహారం మారింది. ఇంత జరిగితే ప్రభుత్వం ఊరుకుంటుందా.. అవకాశం కోసం ఎదురు చూసింది. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అల్లు అర్జున్ వ్యవహారాన్ని లేవనెత్తాడు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పనిలో పనిగా సినిమా వాళ్లకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అంటూనే.. ఎవ్వరినైనా తప్పుచేస్తే వదిలిపెట్టేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవతి మృతికి, శ్రీతేజ్ ఆస్పత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడటానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని, ఆయన వ్యవహార శైలి వల్లనే ఇదంతా జరిగిందని నేరుగా అల్లు అర్జున్ ను టార్టెట్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ సైతం తగ్గేదే లే అంటూటూ రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది గంటలకే మీడియా సమావేశం పెట్టాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సీఎం రేవంత్ పేరు ప్రస్తావించకుండానే ఆయన్ను టార్గెట్ చేశాడు .
అల్లు అర్జున్ దూకుడుకుతోడు.. ఆయన లీగల్ టీంసైతం అదుపు తప్పి వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపించేటప్పుడు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి పోలీసులపై వేసిన వంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు హర్ట్ అయ్యారు. అంతే కాదు.. తనను వెళ్లిపోవాలని ఏ పోలీసు అధికారి చెప్పలేదని.. పైగాతాను వస్తుంటే వాళ్లే రూట్ క్లియర్ చేశారని అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చెప్పాడు. అల్లు వ్యవహారశైలి, ఆయన లీగల్ టీం వ్యవహారశైలి పోలీస్ డిపార్టుమెంట్ కు ఆగ్రహాన్ని కలిగించింది. సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ కృష్ణమూర్తి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేం తల్చుకుంటే ఇక్కడ ఉండలేరని హెచ్చరించారు. పోలీస్ కమిషనరే మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అర్జున్ చేసిన వ్యాఖ్యన్నీ తప్పు అని చెప్పేలా ఆధారాలు బయట పెట్టారు. నిజానికి అర్జున్ తన తప్పేం లేదని చెప్పుకోవడానికి కొన్ని ప్రివిలేజెస్ తీసుకున్నారు. తనకు అనుకూలంగా వాదనలు వినిపించుకున్నారు. తన ఇమేజ్ కు దెబ్బపడుతోందని బాధపడ్డారు. కానీ నీ ఇమేజ్ సంగతి సరే.. డిపార్టుమెంట్ ఇమేజ్ ను దెబ్బతీస్తానంటే ఊరుకుంటామా అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడీ ఇష్యూలో.. అర్జున్ రాజకీయ నేతలతో పెట్టుకున్నదికాక.. పోలీసులతోనూ పెట్టుకున్నారు. తాత్కాలికంగా తన వాదనలతో బెయిల్ ఇప్పించిన నిరంజన్ రెడ్డి భవిష్యత్ లో దిద్దుకోలేనంత నష్టం చేశారు.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వ్యవహారశైలి టాలీవుడ్ కు శాపంగా మారింది. టికెట్ రేట్లు భారీగా పెంచి, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వంపై అల్లు వారి కుటుంబం కయ్యానికి కాలుదువ్వింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా.. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తారా అంటూ ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచటాలు ఉండవని తేల్చి చెప్పేశాడు. రాబోయేది పండుగల సీజన్ కావటంతో వరుసగా రిలీజ్‌కు పెద్ద సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అల్లు అర్జున్ వ్యవహారశైలితో ఇప్పుడు ఆ సినిమాలకు భారీ నష్టం వాటిల్లనుంది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ వెనక్కుతగ్గి ప్రభుత్వానికి, పోలీసులకు సారీ చెప్పేవరకు రేవంత్ ప్రభుత్వం తగ్గేదేలే అంటుంది. ఇందులో ప్రభుత్వాన్ని తప్పుబట్టనికి కూడా ఏమీలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అల్లు అర్జున్ తన యాటిట్యూడ్ తో దుర్వినియోగం చేసి టాలీవుడ్ మొత్తానికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడు.
http://www.teluguone.com/news/content/tollywood-shake-with-allu-arjun-arrogance-39-190181.html