తమ్మిడికుంటకు కొత్త రూపు.. హైదరాబాద్‌కు మరో అందమైన ఆభరణం.!
Publish Date:Nov 11, 2026
Advertisement
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.కొంతమందికి నష్టం జరిగినా.. భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో తమ్మిడికుంటను అభివృద్ధి చేశామని సీఎం తెలిపారు. ఒకప్పుడు 14 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామన్నారు. ఈ అభివృద్ధి కోసం అక్కినేని నాగార్జున మంచి మనసుతో ముందుకొచ్చి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందించారని ప్రశంసించారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ నాగార్జున హీరోగా నిలిచారని కొనియాడారు. హైదరాబాద్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని సీఎం గుర్తుచేశారు. ఒకప్పుడు నగరంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో 50 శాతం మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల ఆక్రమణల కారణంగా వర్షాలు పడితే రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయని, కాలనీలు జలమయమవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. వికారాబాద్ ప్రాంతంలో ప్రారంభమయ్యే ముచుకుందా నది, మూసా, ఈసా నదులు కలిసే ప్రాంతంలో మూసీగా మారుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతలు నదుల ఆధారంగానే అభివృద్ధి చెందాయని, వందేళ్ల క్రితమే నిజాం మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టారని తెలిపారు. అయితే ప్రస్తుతం మూసీ తీవ్ర కాలుష్యానికి గురైందని, దాని ప్రభావంతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చేందుకే మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రకృతిని పరిరక్షించడమే తన లక్ష్యమని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చెప్పారు. అందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని, ఈ ప్రక్రియలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఇది కూడా చదవండి: సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ..ఆసక్తికరంగా మారిన పుస్తకం బహూకరణ.! ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో అందరూ కలిసిరావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నిన్నటి వరకు శిల్పారామం గురించి మాట్లాడుకున్నారని, ఇకపై తమ్మిడికుంట గురించి మాట్లాడుకుంటారని అన్నారు. ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అనేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చమత్కరించారు. చెరువు పరిసరాల్లో భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తమ్మిడికుంట పరిసరాల్లో లేక్ ఎకానమీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. చెరువు ఆవరణలో జమ్మి చెట్టును నాటాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు. అలా చేస్తే దసరా వేడుకలకు చెరువులు వేదికలుగా మారుతాయని, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు అవి దోహదపడతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీకు నచ్చవచ్చు: అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్మెంట్..కాబోయే భార్య ఎవరో తెలుసా.? [ Thammidikunta Lake, CM Revanth Reddy Musi River Rejuvenation, HYDRA, Akkineni Nagarjuna ]
త్వరలోనే మూసీ పునరుజ్జీవనం తొలి దశ పనులు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. నగర ప్రజల జీవితాలు మూసీ నదితో ముడిపడి ఉన్నాయని, నదుల పేర్లను ఆడబిడ్డలకు పెట్టుకునే సంస్కృతి మనదని గుర్తుచేశారు. మూసీ సుందరీకరణ మాత్రమే తమ లక్ష్యం కాదని, నదికి పునరుజ్జీవం కల్పించడమే అసలు ఉద్దేశమని స్పష్టం చేశారు. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించాల్సిందేనని అన్నారు.
http://www.teluguone.com/news/content/thammidikunta-lake-25-236877.html




