మరో ఉగ్ర హెచ్చరిక
Publish Date:Feb 26, 2013
Advertisement
హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళ తరువాత, ఉగ్రవాదముఠాలు సరి కొత్త పందాలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు ఎక్కడయినా ప్రేలుళ్ళు జరిపిన వెంటనే అది తమ ఘన కార్యమేనని ప్రకటించుకొనే వారు. కానీ, ఈసారి మాత్రం ప్రేలుళ్ళు జరిగిన తరువాత ప్రభుత్వానికో, పోలీసులకో లేక మీడియాకో తమ ఘన కార్యం గురించి తెలిపే బదులు, రెండు మూడు రోజుల తరువాత, ప్రతిపక్షనేత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి లేఖను పంపారు. బహుశః కసాబ్, అఫ్జల్ గురుల ఉరి తరువాత, భారత ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల కటిన వైఖరి అవలంబించడమే దానికి కారణం అయి ఉండవచ్చును. అందువల్ల, సదరు ఉగ్రవాదులు తమ ప్రకటన విడుదల చేస్తూనే, తమ ఉనికిని గోప్యంగా ఉంచుకోవడమే మేలని వారు భావిస్తునట్లు ఉన్నారు. ప్రేలుళ్ళు జరిపిన తరువాత తమ సభ్యులు సంఘటనా స్థలం నుండి సురక్షిత ప్రాంతాలకి చేరుకోన్నారని రూడీ చేసుకొన్నతరువాతనే లేఖలు పంపడం గమనించి నట్లయితే, వారు ఈ మద్యన తమ ఉనికిని ఎవరూ గుర్తించకుండా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అర్ధం అవుతుంది. వారు పంపే లేఖలు కూడా మీడియాకో, సంబందిత అధికారులకో కాకుండా వేరెవరికో పంపడం కూడా వారి జాగ్రత్తలలో భాగమే అయిఉండవచ్చును. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నహరిద్వార్ రైల్వే స్టేషన్, కాఠ్‌గోదామ్ రైల్వే స్టేషన్లను, హరిద్వార్‌లోని హర్‌కీ పారీ స్నాన ఘట్టం వంటి మత, పర్యాటక స్థలాలను పేల్చేస్తామని, హరిద్వార్ రైల్వే స్టేషన్ మాజీ సూపరింటెండెంట్ అమరీందర్ సింగ్‌కు జైషే మహమ్మద్ పేరుతో నిన్నఒక హెచ్చరిక లేఖ వచ్చింది. పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారం తీర్చుకొంటామని ఆలేఖలో వారు హెచ్చరించారు. అయితే, అమరీందర్ సింగ్ తనకు గతంలో కూడా ఇటువంటి లేఖలు చాలానే వచ్చేవని, కాని అవి లష్కర్ ఉగ్రవాద ముఠాల నుండి వచ్చేవని, కానీ, జైషే మహమ్మద్ పేరుతో హెచ్చరిక లేఖ అందుకోవడం ఇదే మొదటిసారని అని మీడియాకి తెలిపారు. కానీ, ప్రస్తుతం అందిన లేఖలో చేతివ్రాతను పరిశీలిస్తే, అది పాత లేఖలతో సరిపోలుతోందని ఆయన చెప్పడం విశేషం. అంటే, జైష్ పేరు మీద వచ్చిన లేఖ కూడా లష్కర్ నుండే వచ్చి ఉండవచ్చునని భావించవచ్చును. అంటే, ఆ రెండు సంస్థలు భారత్ పై దాడికి ఇప్పుడు చేతులు కలిపినట్లు అర్ధం అవుతోంది. అదే నిజమయితే, మనకు పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.ఇప్పటికయినా మన ప్రభుత్వాలు రాజకీయాలను కొంచెం పక్కన పెట్టి, దేశ భద్రతపై దృష్తి సారిస్తే మంచిది.
http://www.teluguone.com/news/content/terrorists-39-21233.html