తెలంగాణ మునిసిపోల్స్ లో తెలుగుదేశం, జనసేన పొత్తు?!
Publish Date:Jan 12, 2026
Advertisement
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలు రాష్ట్రంలో తమ ఉనికి చాటుకోవడానికి తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఒక గొప్ప అవకాశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ ప్రకటన స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి రావాల్సి ఉంది. జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ పోటీపై ప్రకటన చేశారు. ఆయనా ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు.. రాష్ట్రంలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదనీ, ఒంటరిగానే రంగంలోకి దిగుతామని ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడి ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కొంత కాలం కిందట జనసేనాని పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలకు తెలంగాణ దిష్టి తగలడమే కారణమంటూ చేసిన వ్యాఖ్య లు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ తీవ్రంగా ఖండించాయి. అంతకు ముందు కూడా జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై ఎమోషనల్ గా స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో దాదాపు పది రోజులు తాను నిద్రలేని రాత్రులు గడిపాన్న ఆయన వ్యాఖ్య పట్ల కూడా తెలంగాణ సమాజంలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే జనసేనతో పొత్తు వల్ల తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భావనతోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు పొత్తునకు నో అని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది పక్కన పెడితే.. తెలంగాణలో మరీ ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉండే జీహచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగితే కచ్చితంగా ప్రభావం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్ల ప్రభావం గణనీయంగా ఉండటం వల్ల ఆ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమిగా పోటీలోకి దిగితే చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. ఇది తెలంగాణలో ఇతర ప్రాంతాలలో కూడా బలోపేతం కావడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణలో తమ పార్టీల బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు. తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, నాయకత్వం లేకపోవడంతో ఇక్కడి ఎన్నికలలో రాష్ట్ర విభజన తరువాత పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక జనసేన పరిస్థితీ అంతే.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలంగాణలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా వారి సేవలను ఉపయోగించుకోవడానికి ఏమంత ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ కూడా మునిసిపోల్స్ ఒక అవకాశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన కొన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, తరువాత బీజేపీకి మద్దతుగా తమ అభ్యర్థులను ఉపసంహరించుకుంది. అలా అప్పట్లో జనసేన ఒక అవకాశాన్ని జారవిడుచుకుందని చెప్పవచ్చు. జనసేన ఇప్పటివరకు తెలంగాణలో ఒకే ఒక ప్రధాన ఎన్నికల్లో అంటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ ఎనిమిది సీట్లలో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణాలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా క్రియాశీలం కావడానికి ప్రయత్నిస్తున్నది. కనుక ఈ రెండు పార్టీలకూ తెలంగాణ మునిసిపోల్స్ ఒక అవకాశం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలో కూటమిగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తే నిస్సందేహంగా గణనీయమైన ప్రభావం చూపుతాయనీ, ఇది భవిష్యత్ లో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలూ అత్యంత క్రియాశీలంగా మారడానికి, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విధంగా బలోపేతం కావడానికి దోహదపతుందనీ అంటున్నారు. చూడాలి మరి ఈ రెండు పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందో?
http://www.teluguone.com/news/content/telugudesham-and-janasena-allience-in-telangana-municipal-39-212406.html





