తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన కరోనా! వైరస్ బలహీనంగా ఉందన్న సీసీఎంబీ
Publish Date:Jan 29, 2021
Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన కరోనా వైరస్ ఎక్కువగా కన్పిస్తోందని తెలుస్తోంది. అయితే ఇది ఇతర రకాల కన్నా ఒకింత బలహీనంగా ఉందని సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కొత్త రకం మాత్రం కాదని... ఇప్పటికే ఉన్న వైరస్ బలహీనపడటం వల్ల ఉత్పన్నమై ఉండొచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. ఈ రకం కొత్త వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధరించేందుకు పరిశోధనను ముమ్మరం చేయనున్నారు శాస్త్రవేతలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతదేశంలో భిన్నమైన కరోనా వైరస్ ఎక్కువగా కనిపిస్తోందని. దీనికి ఎన్440కే అని పేరు పెట్టినట్లు డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. పూర్తిగా కొత్త రకం కాదని..భిన్నమైనదే. కొంతకాలంగా వ్యాప్తిలో ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో స్వల్ప కేసుల్లో కనిపించిందని.. ఇప్పుడు ఎక్కువ మందికి ఇది వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఎన్440కే రకం వల్ల వ్యాధి లక్షణాలు పెద్దగా ఉండటంలేదు. స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయన్నారు రాకేష్ మిశ్రా. మొదటగా విస్తరించిన వైరస్ బలహీనపడటం వల్ల ఇది ఉత్పన్నమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటన్లో వెలుగు చూసిన కరోనా వైరస్ స్ట్రైయిన్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. శర వేగంగా విస్తరిస్తూ చాలా దేశాలను చుట్టేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్న కరోనా వైరస్ ఆనవాళ్లు కన్పించడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి ఈ రకంపై పెద్దగా డేటా అందుబాటులో లేదని..రానున్న రోజుల్లో భారీ స్థాయిలో వైరస్ జన్యుక్రమాలను ఆవిష్కరించి, మరిన్ని వివరాలు వెలుగులోకి తెస్తామని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. దేశంలో ఈ రకం వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధారించేందుకు పరిశోధనను ముమ్మరం చేయనున్నట్లు వివరించాురు.
http://www.teluguone.com/news/content/telugu-states-people-tested-new-covid-virus-says-ccmb-39-109340.html





