తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వండి.. ఈసీకి కవిత విజ్ఞప్తి
Publish Date:Jul 12, 2026
Advertisement
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమగ్ర వివరణ పంపినట్లు వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదివారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషనర్లకు లేఖ రాశారు. ఆ లేఖలో ఈ ఏడాది ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల కమిషన్ "తెలంగాణ రక్షణ సేన" పేరును తమకు కేటాయిస్తూ లేఖ పంపిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించడం, సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అయితే జూన్ 23న ఎన్నికల కమిషన్ పంపిన లేఖలో పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని తెలిపిందని, కానీ ఆ అభ్యంతరాల కాపీలను ఇప్పటి వరకు తమకు అందించలేదని విమర్శించారు. ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేశారో, వాటి వివరాలేమిటో తెలియకుండా తాము ఎలా సమాధానం చెప్పగలమని ప్రశ్నించారు. తెలంగాణ జనాభా మూడున్నర కోట్లకు పైగా ఉండగా కేవలం వెయ్యి అభ్యంతరాలను చూపిస్తూ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. అభ్యంతరాల వెనుక చట్టపరమైన బలం ఏమిటో పరిశీలించాలని, అవి సమన్వయంతో దాఖలు చేశారా అనే అంశం కూడా తెలుసుకోవాల్సి ఉంద న్నారు." తెలంగాణ రక్షణ సేన" అనే పేరును స్వతంత్రంగా, పూర్తి సదుద్దేశంతో ఎంపిక చేసుకున్నామని తెలిపారు. దేశంలో ఈ పేరుతో మరే రాజకీయ పార్టీ నమోదు కాలేదని, గుర్తింపు పొందిన లేదా నమోదైన ఏ రాజకీయ పార్టీ పేరుతోనూ ఇది పోలిక కలిగి లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ పేర్లను పోల్చేటప్పుడు మొత్తం పేరునే ఒక యూనిట్‌గా పరిగణించాలే తప్ప విడివిడిగా పదాలను పరిశీలించకూడదన్నారు. "తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్)" మరియు "తెలంగాణ రాజ్య సమితి" పేర్లు నిర్మాణం, ఉచ్చారణ, నాయకత్వం, ప్రజల్లో గుర్తింపు వంటి అన్ని అంశాల్లో పూర్తిగా భిన్నమని వివరించారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, ప్రజా సేవ, జన్ అధికార్, రాష్ట్రీయ జనతా, డెమోక్రాటిక్, సోషల్, రిపబ్లిక్ ఇండియా, శిరోమణి వంటి సాధారణ పదాలతో వందలాది రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయని, అలాంటి పేర్ల జాబితాను కూడా ఎన్నికల కమిషన్‌కు జత చేశామని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందు తమ పార్టీపై వచ్చిన అన్ని అభ్యంతరాల కాపీలు, తమకు వ్యతిరేకంగా వినియోగించనున్న ఆధారాలను అందించాలని కోరారు. వాటిని పరిశీలించి సమాధానం ఇచ్చేందుకు తగిన సమయం ఇచ్చిన తర్వాతే విచారణ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.కేవలం సాధారణ భౌగోళిక లేదా వర్ణనాత్మక పదాల ఆధారంగా, ఊహాజనిత సంక్షిప్త రూపాలను చూపిస్తూ వచ్చిన అభ్యంతరాలను తిరస్కరించాలని కోరిన పార్టీ, ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 29A ప్రకారం "తెలంగాణ రక్షణ సేన" పార్టీ నమోదు దరఖాస్తును ఆమోదించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేసింది.
http://www.teluguone.com/news/content/telangana-rakshana-sena-party-25-225816.html




