తెలంగాణలో ఏడు రోజులు భారీ వర్షాలు
Publish Date:Jun 27, 2026
Advertisement
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య, మరియు తూర్పు తెలంగాణ పరిధిలోని జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. నేడు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపుల ఉధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని, అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వారం రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను, స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు అందాయి. హైదరాబాద్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో డీఆర్ఎఫ్ (DRF) సిబ్బందిని కూడా వీధుల్లో రంగంలోకి దించారు. వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, పాతబడిన భవనాల నీడన గానీ నిల్చోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దరిదాపుల్లోకి వెళ్లడం ప్రమాదకరమని, పిల్లలను ఇళ్లలోనే సురక్షితంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో భారీ వర్షాల వల్ల రవాణా వ్యవస్థకు ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ, రైల్వే శాఖలు సైతం తగిన చర్యలు తీసుకుంటున్నాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం సంసిద్ధంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. పౌరులు వాతావరణ అప్డేట్లను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.
http://www.teluguone.com/news/content/telangana-rains-36-224308.html





